బాసర ఆలయాన్ని అభివృద్ధి చేస్తా.. : రామారావు పటేల్

భైంసా, వెలుగు: ప్రతిష్ఠాత్మక బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ముథోల్​ ఎమ్మెల్యే రామారావు పటేల్​అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బుధవారం మొదటిసారిగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి అభినందించారు.

గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ సహకారంతో బాసర క్షేత్రాన్ని యాదాద్రి తరహాలో పునర్నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. పటేల్​కు ఆలయ ఈవో విజయ రామారావు​ తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. అనంతరం మాస్టర్​ ప్లాన్​పై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో లీడర్లు సతీశ్వర్​రావు, సాయినాథ్, రమేశ్, తాలోడ్​శ్రీనివాస్, ఆలయ అధికారులు ఉన్నారు.