భైంసా, వెలుగు: వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాలకవర్గంతో పాటు ఆఫీసర్లకు సూచించారు. శుక్రవారం భైంసాలోని వ్యవసాయ మార్కెట్‌కమిటీ ఆఫీస్‌లో సర్వసభ్య సమావేశం జరిగింది.
ఎమ్మెల్యేగా గెలుపొందిన రామారావు పటేల్‌ను పాలకవర్గం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ఆఫీస్, యార్డును విశాలమైన ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మార్కెట్అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముథోల్‌లో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. నియోజకవర్గ రైతుల అభివృద్ధే తన లక్ష్యమన్నారు.
కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు అమాయక రైతులకు మోసం చేయొద్దని హెచ్చరించారు. చైర్మన్ రాజేశ్ బాబు, వైస్ చైర్మన్ జేకే పటేల్, ఏడీఏ వీణ, మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్,డైరెక్టర్లు, వ్యాపారులు పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం కల్పంచాలని ఎమ్మెల్యేకు వినతి
కుభీర్: తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం కుభీర్ మండలంలోని కుప్టి గ్రామస్తులు ఎమ్మెల్యే రామారావు పటేల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు గడుస్తున్న తమ గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడంలో గత పాలకులు నిర్లక్ష్యం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు.
భైంసా మార్కెట్ కు వెళ్లాలంటే సరైన సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం తమ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించి సమస్య పరిష్కరించాలని కోరారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.