ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లపై నిరసనలు

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లపై నిరసనలు
  • ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో రెండు గ్రామాల ప్రజల నిరసన  

ముదిగొండ, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులను ఎంపిక చేశారని పంచాయతీ ఆఫీసుకు తాళం వేసిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురంలో ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులను ఎంపిక చేశారని మంగళవారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు ఇండ్లు లేకపోయినా పేరు ఎందుకు రాలేదని, ఇండ్లు, పొలాలు, కార్లు ఉన్నవారినే ఎలా ఎంపిక చేస్తారని వనంవారి కృష్ణాపురం గ్రామస్తులు ప్రశ్నించారు. అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో మండిపడ్డారు. కార్యదర్శి శ్రీనివాస్ ను, గుమస్తాను పంచాయతీ ఆఫీసులో ఉంచి  బయట నుంచి తాళం వేసి నిరసన తెలిపారు. 

పోలీసులు వెళ్లి నచ్చజెప్ప గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో లాక్ తీశారు. అదేవిధంగా మండలంలోని పండ్రేగుపల్లి గ్రామస్తులు నిజమైన అర్హులకు కాకుండా అనర్హులను ఎంపిక చేశారని నిరసనకు దిగారు. తమను అర్హులుగా గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని ఎంపీడీవో ఆఫీసు ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎంపీడీవో శ్రీధర్ స్వామికి  వినతిపత్రం అందించారు. మరోసారి సర్వే చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు.