- ముద్ర, ధని లోన్ అప్లై చేసిన వారే టార్గెట్
- రూ. 20 లక్షల వరకు మోసం
వనపర్తి, వెలుగు: ముద్ర, ధని లోన్ యాప్‌ల పేర్లతో రూ. 20 లక్షలు కాజేసిన సైబర్ నేరస్తుల ముఠాను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకోటకు చెందిన కొత్త కుమ్మరి రాజు ముద్ర విశ్వకర్మలోన్ కు జనవరిలో ఆన్‌లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్నాడు.
జులై 11న సైబర్ నేరగాళ్లు ఒక వాట్సాప్ నంబర్ నుంచి పీఎం విశ్వకర్మ లోన్ శాంక్షన్ కావడానికి డబ్బులు పంపాలంటూ మెసేజ్ పంపారు. వారి గూగుల్‌పే, ఫోన్‌పే నంబర్లకు రెండు విడతల్లో మొత్తం రూ 12,250- పంపాడు. ట్యాక్స్ కట్టాలని రూ.9,000 అడగ్గా అనుమానం వచ్చి కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు పెద్దమందడి మండలం జంగమాయపల్లి కురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా వనపర్తికి చెందిన నర్సింగ్‌నాయక్ సూత్రధారి అని చెప్పాడు.
వనపర్తిలో ఒక రూమ్ కిరాయికి తీసుకుని రాత్లావత్ రమేశ్, ఇస్లావాత్ రాములు, కొత్తపల్లి ఉమేశ్, బోయ వీరేశ్, ఇద్దరు మైనర్లతో కలిసి ఈ దందా నడిపించాడు. కాగా ముద్రలోన్స్, ధనిలోన్ యాప్ ల వివరాలను బిహార్ కు చెందిన రోహిత్ అనే వ్యక్తి దగ్గర తీసుకుని ఈ టీంతో బాధితులకు ఫోన్లు చేయించేవాడు. లోన్ శాంక్షన్ అయిందని డబ్బులు, ట్యాక్సులు, జీఎస్టీ కట్టాలంటూ మోసం చేసేవారని వెల్లడించారు. దాదాపు ఒక్కొక్కరి నుంచి రూ.10,000ల- నుంచి రూ.40,000లు తీసుకొని, వారికి లోన్ శాంక్షన్ అయిందంటూ ఫేక్ డాక్యుమెంట్ పంపేవాడు. అనంతరం ఫోన్లు స్విచ్ఛాప్ చేసే వాడు.
బాధితుల నుంచి కొట్టేసిన డబ్బులో రోహిత్ నుంచి 50 శాతం తీసుకొని, నర్సింగ్ 25శాతం ఉంచుకొని , మిగతా 25శాతం డబ్బులు తన టీం అందరికీ కమిషన్ రూపంలో ఇచ్చేవాడు. కాగా రాష్ట్రంలో ముద్ర, ధని లోన్ యాప్ ల మోసాలపై ఫిర్యాదులు రాగా.. కొత్తకోట పోలీస్ స్టేషన్ లో నమోదు అయిన కేసు విచారణను చేపట్టామన్నారు. జిల్లా సైబర్ సెక్యూరిటీ ఇన్ చార్జి డీఎస్పీ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్ ఐ మంజునాథ్ రెడ్డి పోలీసు సిబ్బంది దర్యాప్తు చేసి సైబర్ నేరస్తులను గుర్తించారు. వారిలో 8 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
వీరు ఇప్పటివరకు దాదాపు 250 మంది నుంచి రూ. 20 లక్షల వరకు కాజేశారన్నారు. ఈ ముఠా నుంచి రూ. 5 లక్షల విలువ గల 26 మొబైల్ ఫోన్లు, 22 వివిధ కంపెనీల సిమ్ కార్డులు, రూ. 4.15 లక్షల విలువ చేసే 5 మోటార్ బైక్స్, రూ. 85 వేలు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ మొత్తం రూ. 10 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.