పవన్ కళ్యాణ్ కు మద్దతిచ్చిన ముద్రగడ కూతురు... ముద్రగడ ఏమ్మన్నారంటే..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్రమంతా ఒక ఎత్తైతే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఇంకో ఎత్తు అని చెప్పాలి.2019ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘోరంగా ఓడిన పవన్, ఈసారి తప్పకుండ గెలిచి తీరాలి అన్న కసితో ఉన్నారు. మరోపక్క పిఠాపురం నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార వైసీపీ పవన్ ను ఓడించటానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నియోజకవర్గం నుండి వంగా గీతను బరిలో దింపిన జగన్ అక్కడి బాధ్యతలు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి,ఎంపీ మిథున్ రెడ్డికి అప్పగించారు.

పిఠాపురంలో హోరోహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ముద్రగడ కూతురు క్రాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ వీడియో రిలీజ్ చేసిన క్రాంతి ముద్రగడ పద్మనాభంను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని పవన్ ను తిట్టటానికే వాడుతున్నారని, ముద్రగడ అభిమానులు సైతం ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. తన మద్దతు పవన్ కే అని అన్నారు క్రాంతి.

కూతురు క్రాంతి వ్యాఖ్యలపై స్పందించారు ముద్రగడ. తన కూతురుతో కొంతమంది ఈ వీడియో విడుదల చేయించారని, క్రాంతి వ్యాఖ్యలకు తాను బాధపడినా, భయపడనని అన్నారు. ఎవరు బెదిరించినా భయపడనని, జగన్ కు సేవకుడిగానే ఉంటానని అన్నారు. తనకు, తన కూతురికి మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బెదిరేది లేదని స్పష్టం చేశారు ముద్రగడ.