
మాగనూర్, వెలుగు: ప్రపంచంలో ముడుమల్ గ్రామం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువురాళ్లను ఆదివారం మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ముడుమల్ నిలువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో స్థానం దక్కడం తెలంగాణకు గర్వకారణమని ఆయన అన్నరు.
నిలువు రాళ్లకు యునెస్కో శాశ్వత గుర్తింపు లభిస్తే ప్రపంచస్థాయిలో ప్రత్యేక స్థానం దక్కుతుందని మంత్రి వివరించారు. ఈ స్థలాన్ని పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని, నిలువరాళ్ల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సైట్‌లో భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు.
అంతకుముందు, మాగనూర్ మండలంలోని నేరడగం గ్రామంలో పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం జాతర బ్రహ్మోత్సవాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అనంతరం అనాథ శరణాలయాన్ని ప్రారంభించారు. సమాజంలో విలువలను పునరుద్ధరించడంలో ఉపయోగపడతాయన్నారు.
రూ. 50 లక్షలు అన్నదాన కార్యక్రమానికి మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పునరావాస సమస్యలను తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేశ్ గౌతమ్, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్ వేదకుమార్ తదితరులు పాల్గొన్నారు.