చండూరు, వెలుగు: చండూరులో బీజేపీ లీడర్, మున్సిపల్ వైస్చైర్మన్సుజాత భర్త దోటి వెంకటేశ్‌యాదవ్, మరో బీజేపీ నేత కోడి శ్రీనివాస్ ఇండ్ల ఎదుట మంగళవారం అర్ధరాత్రి మఫ్టీలో ఉన్న పోలీసులు హల్చల్ చేశారు. వీరితో పాటు స్థానిక ఎస్ఐ కూడా ఉండడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న బాధితులు స్థానిక సీఐకి సమాచారం ఇవ్వగా ఆయన అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా సీఐకి, బీజేపీ లీడర్లకు వాగ్వాదం జరిగింది.
అసలేం జరిగిందంటే...
బీజేపీ నేత దోటి వెంకటేశ్‌యాదవ్ ఇల్లు అయ్యప్ప దేవాలయం పక్కన ఉంటుంది. కోడి శ్రీనివాస్ ఇల్లు మునుగోడు వెళ్లే దారిలో ఉంది. వీరిద్దరూ మంగళవారం రాత్రి శ్రీనివాస్‌కు చెందిన స్కూల్లో ఉప ఎన్నికల గురించి చర్చించుకుంటున్నారు. రాత్రి 11.30 గంటలకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేశ్, శ్రీనివాస్ ఇండ్ల వద్ద తచ్చాడుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే వెంకటేశ్, శ్రీనివాస్‌లకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు బీజేపీ కార్యకర్తలకు ఫోన్ చేసి చేయడంతో అందరూ వెంకటేశ్ యాదవ్ ఇంటికి వచ్చారు. ‘మీరు ఎవరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఎందుకున్నారు’ అని అక్కడున్న వ్యక్తులను ప్రశ్నించారు. దీంతో వారు తాము పోలీసులమని సమాధానం ఇచ్చారు. పోలీసులైతే ఇంత రాత్రి వేళ ముఖాలను కవర్చేసుకుని ఎందుకు తిరుగుతున్నారని అడగ్గా సరైన సమాధానం చెప్పలేదు. దీంతో స్థానిక సీఐ అశోక్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆయన వెంటనే అక్కడికి రాగా ‘ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారని, పోలీసు వాహనాలు కూడా ఉన్నాయని ఆయనకు వివరించారు. దీనికి ఆయన వాళ్లు మఫ్టీలో ఉన్న పోలీసులని తనకు తెలుసని, ఎక్కడి నుంచి..ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికే వచ్చానన్నారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ మాట్లాడుతూ కిడ్నాప్ చేయడానికి వచ్చారనడం కరెక్ట్ కాదని, ఎన్నికల తనిఖీల్లో భాగంగా మద్యం, డబ్బుల పంపిణీ అరికట్టడానికే డ్యూటీ చేస్తున్నారన్నారు.
టీఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నరు
తనను వారం రోజులుగా టీఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని వెంకటేశ్‌యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన సీఐ అశోక్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. డబ్బు కట్టలను తమ ఇండ్లలో పెట్టి అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మఫ్టీలో ఉన్నవాళ్లు పోలీసులయితే ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేశారని సీఐని ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి అనుచరులమైన తమను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారన్నారు. తమ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే అధికార పార్టే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పార్టీ మారకుంటే తన స్కూల్ ఎలా నడుస్తుందో చూస్తామని బెదిరిస్తున్నారని కోడి శ్రీనివాస్ ఆరోపించారు. స్థానిక పోలీసులు వీరికి సహరిస్తున్నారన్నారు.