NZ vs PAK: అరంగేట్రం అదుర్స్: న్యూజిలాండ్ తరపున పాకిస్థాన్ క్రికెటర్ వరల్డ్ రికార్డ్!

NZ vs PAK: అరంగేట్రం అదుర్స్: న్యూజిలాండ్ తరపున పాకిస్థాన్ క్రికెటర్ వరల్డ్ రికార్డ్!

న్యూజిలాండ్ ఆల్ రౌండర్ ముహమ్మద్ అబ్బాస్ తన తొలి మ్యాచ్ లోనే వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. శనివారం (మార్చి 29) నేపియర్‌లోని మెక్‌లీన్ పార్క్‌లో పాకిస్థాన్ తో జరిగిన మొదటి వన్డేలో అతను 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్ లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా అబ్బాస్ వరల్డ్ రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకముందు ఈ రికార్డ్ భారత ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య పేరిట ఉంది. కృనాల్ తన డెబ్యూ మ్యాచ్ లో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 2021లో ఇంగ్లాండ్ పై అతను ఈ ఘనతను అందుకున్నాడు.

ALSO READ | IPL 2025: ఇవాళ (మార్చి29) గుజరాత్ vs ముంబై.. బోణీ ఎవరిదో?

ఈ మ్యాచ్ లో ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ముహమ్మద్ అబ్బాస్ ఆరంభం నుంచి పాకిస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. బౌండరీల వర్షం కురిపించి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఓవరాల్ గా 26 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ కివీస్ ఆల్ రౌండర్ ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు.. 3 సిక్సర్లు ఉన్నాయి. ముహమ్మద్ అబ్బాస్ పాకిస్థాన్ సంతతికి చెందిన క్రికెటర్ కావడం విశేషం. అతను  పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అజార్ అబ్బాస్ కుమారుడు. ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయిన అర్స్లాన్.. న్యూజిలాండ్ దేశవాళీ క్రికెట్ లో అద్భుత ప్రదర్శన ఆధారంగా న్యూజిలాండ్ జట్టుకు ఎంపికయ్యాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే పాకిస్థాన్ పై న్యూజిలాండ్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజి లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. చాప్ మన్ (132) భారీ సెంచరీకి తోడు డారిల్ మిచెల్ (76), ముహమ్మద్ అబ్బాస్ (52) హాఫ్ సెంచరీలు చేసి రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 271 పరుగులకే ఆలౌట్ అయింది. బాబర్ అజామ్(78), సల్మాన్ అఘా (58) హాఫ్ సెంచరీలు చేసినా కీలక సమయాల్లో ఔట్ కావడంతో పాకిస్థాన్ కు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.