T20 World Cup 2024: గెలుపు జోష్‌లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి స్టార్ స్పిన్నర్ ఔట్

T20 World Cup 2024: గెలుపు జోష్‌లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి స్టార్ స్పిన్నర్ ఔట్

టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ అంచనాలకు మించి అదరగొడుతోంది. న్యూజిలాండ్ జట్టుపై 84 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న ఆఫ్ఘాన్..  పపువా న్యూ గినీపై గెలిచి, హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 రౌండ్‌కి దూసుకెళ్లింది. ఆఫ్ఘాన్ మూడో విజయంతో న్యూజిలాండ్ జట్టు అధికారికంగా గ్రూప్ స్టేజీ నుంచే ఇంటిదారి పట్టనుంది. అయితే గెలుపు జోష్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ కు సూపర్ 8 కు ముందు బిగ్ షాక్ తగిలింది. 

స్టార్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ చేతి వేలి గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్ సమయంలో ముజీబ్ కు గాయమైంది. ఈ కారణంగానే ఐపీఎల్ ఆడలేదు. అయితే టీ20 వరల్డ్ కప్ కు గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంచి దూరం కావాల్సి వచ్చింది. తొలి మ్యాచ్ లో ఉగాండాపై ఆడిన ఈ ఆఫ్ స్పిన్నర్ నాలుగు ఓవర్లలో 14 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత జరిగిన న్యూజిలాండ్, పపువా న్యూ గినియా జట్లపై ముజీబ్ ఆడలేదు.

పవర్ ప్లే లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసే ముజీబ్ దూరమవ్వడం పెద్ద లోటేనని చెప్పాలి. ముజీబ్ దూరమవడంతో అతని స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్‌ని ఎంపిక చేశారు. సూపర్ 8 కు అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్.. గ్రూప్ దశలో వెస్టిండీస్ పై మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. జూన్ 18 న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక సూపర్ 8 లో భాగంగా భారత్ తో జూన్ 20 న టీమిండియాతో మ్యాచ్ ఆడనుంది.