
- గ్లోబల్ టాప్-30 కంపెనీల లిస్టులో చేరేందుకు కృషి
- ఒక షేరుకు మరొకటి ఉచితం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముకేశ్ అంబానీ గురువారం జరిగిన 47వ ఏజీఎంలో కీలక విషయాలను ప్రకటించారు. వాటాదారులకు 1:1 రేషియోలో బోనస్ షేరు ఇస్తామని వెల్లడించారు. ఇందుకోసం వచ్చే నెల ఐదున బోర్డ్ఆఫ్ డైరెక్టర్స్సమావేశం నిర్వహిస్తామన్నారు. 2017లోనూ రిలయన్స్ బోనస్ షేర్లు జారీ చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్- 50 కంపెనీల్లో ఒకటిగా రిలయన్స్ ఉందని ముకేశ్ ఈ సందర్భంగా వెల్లడించారు. సమీప భవిష్యత్‌లో టాప్-30 గ్లోబల్ కంపెనీల సరసన చేరడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
బోనస్ షేర్లపై ప్రకటన వచ్చిన వెంటనే రిలయన్స్ షేర్ దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 2.63 శాతం పెరిగి చెంది రూ.3,074.80 లకు చేరుకుంది. బీఎస్ఈ లో ట్రేడింగ్ ముగిసే సమయానికి 1.64 శాతం పెరిగి రూ.3,044.75 వద్ద ముగిసింది. రిటైల్ బిజినెస్‌ను రాబోయే నాలుగేళ్లలో రెట్టింపు చేస్తామని, లగ్జరీ జ్యూయలరీ విభాగంలోకి కూడా వస్తామని అంబానీ వెల్లడించారు. తమ కంపెనీ టాప్–5 గ్లోబల్రిటైలర్స్లో ఒకటిగా ఎదిగిందన్నారు. రిలయన్స్ రిటైల్, టెలికం డివిజన్ల లిస్టింగ్ విషయం గురించి మాత్రం ప్రకటన చేయలేదు.
ఏజీఎం హైలెట్స్:
1. రిలయన్స్ 2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్అండ్ డీ కోసం రూ. 3,643 కోట్లు ( 437 మిలియన్ల డాలర్లు) వెచ్చించింది. గత నాలుగు సంవత్సరాల్లోనే పరిశోధనపై ఖర్చు రూ. 11,000 కోట్లకు ( 1.5 బిలియన్ డాలర్లు) చేరుకుంది.
2. 5జీ, 6జీ సాంకేతికతల్లోనే 350కి పైగా పేటెంట్‌లను కలిగి ఉన్న భారతదేశపు అతిపెద్ద పేటెంట్ హోల్డర్‌లలో జియో ఒకటి. గత సంవత్సరం రిలయన్స్ 2,555 పేటెంట్‌లను దాఖలు చేసింది.
3. జామ్‌నగర్‌లో 30 గిగావాట్‌అవర్ వార్షిక సామర్థ్యంతో నిర్మించిన బ్యాటరీ తయారీ కేంద్రం వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. ఇక్కడ రెన్యువబుల్ ఎనర్జీ వ్యాపారాల కోసం రూ.75 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు.
4. ప్రతి భారతీయుడికి ఏఐ ప్రయోజనాలను అందించడానికి జియో బ్రెయిన్‌ను ఏర్పాటు చేస్తారు. అన్ని ప్రాసెస్‌లలో, ఆఫరింగ్‌లలో ఏఐ వాడుతారు. ఇందుకోసం టూల్స్, ప్లాట్‌ఫామ్‌లు తయారు చేస్తారు. దీనివల్ల ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వ్యాపారాలకు మరింత సమర్థంగా సేవలను అందించవచ్చు.
5. జియో ఫోన్‌కాల్ ఏఐతో కస్టమర్‌లు ప్రతి ఫోన్ కాల్‌తో ఏఐని ఉపయోగించవచ్చు. జియో ఫోన్‌కాల్ ఏఐ ఏదైనా కాల్‌ని జియో క్లౌడ్‌లో రికార్డ్ చేసి ఉంచుతుంది. వాయిస్ నుంచి టెక్స్ట్‌గా మార్చుతుంది. తర్జుమా కూడా చేస్తుంది.
100 జీబీ క్లౌడ్ స్టోరేజీ ఫ్రీ
వినియోగదా రులు తమ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, అన్ని ఇతర డిజిటల్ కంటెంట్ డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి 100 జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజీని ఇస్తారు. దీపావళి నుండి జియో ఏఐ- క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్ మొదలవుతుంది.