
Ambani Boeing 737 Max: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారతదేశంతో పాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ లగ్జరీ జీవితం గురించి సాధారణ ప్రజలకు చాలా తక్కువ తెలుసు. గత ఏడాది చిన్న కుమారుడు అనంత్ గ్రాండ్ వెడ్డింగ్ కోసం ఏకంగా రూ.5వేల కోట్ల ఖర్చు చేశారు. ఇక అత్యంత విలాసవంతమైన ముంబై నివాసం యాంటీలియా గురించి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబానీ భారదేశంలో ఏ వ్యాపారి లేదా వ్యక్తి దగ్గర లేని మరో ఖరీదైన వస్తువును సొంతం చేసుకున్నారు.
తాజాగా అల్ట్రా-లగ్జరీ విమానమైన బోయింగ్ 737 MAX 9 రూ.వెయ్యి కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు. దీని ఇప్పటికే ఆయనకు ఉన్న ప్రైవేటు జెట్ విమానాల జాబితాలో చేరటానికి ఇండియాకు చేరుకుంది. ఇప్పటికే దీనికి బాసెల్, జెనీవా, లండన్ లలో కఠినమైన విమాన పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ప్రైవేటు జెట్ ఆగస్టులోనే ఇండియాకు చేరుకున్నప్పటికీ దీనిని అమెరికా వాషింగ్టన్‌లోని రెంటన్‌లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో అసెంబుల్ చేశారు. వాస్తవానికి తొలుత 2022లోనే దీనిని డెలివరీ చేయాలని నిర్ణయించినప్పటికీ అనేక వివాదాల్లో బోయింగ్ సంస్థ చిక్కుకుని ఉన్న నేపథ్యంలో ఆలస్యంగా అంబానీకి డెలివరీ చేయబడింది.
►ALSO READ | బెంగళూరు బ్యాడ్‌డేస్.. తెలుగు టెక్ ఫ్యామిలీలకు కష్టాలు..!
అంబానీ ఫ్యామిలీ టేస్ట్స్, అవసరాలకు అనుగుణంగా ఈ బోయింగ్ విమానాన్ని తయారు చేశారు. దీంతో ఈ ప్రత్యేకమైన జెట్ మోడల్‌ను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాపారవేత్త ముఖేష్ అంబానీనే అని పలు వార్తా నివేదికలు చెబుతున్నాయి. దీనిలో ఉండే విలాసవంతమైన క్యాబిన్, కార్గో కెపాసిటీతో పాటు ఇతర ప్రత్యేకతల దృష్ట్యా దీనిని ఆకాశంలో ఎగిరే 7- స్టార్ హోటల్ అని పిలుస్తుంటారు. రెండు ఇంజన్లు కలిగి ఉండే ఈ జెట్ ఏకకాలంలో 11 వేల 770 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయగలదు.
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి ఇప్పటికే తొమ్మిది ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. వాటిలో బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ERJ-135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900లు కూడా ఉన్నాయి. అలాగే అంబానీ నికర విలువ ప్రస్తుతం దాదాపు రూ.9 లక్షల కోట్లుగా ఉందని అంచనా వేయబడింది.