ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ ముఖేశ్ అంబానీ స్థానం దక్కించుకున్నారు. భారత కుబేరుల జాబితాలో తొలిస్థానం కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ పోటీ పడుతున్నారు. సుదీర్ఘకాలం పాటు భారత కుబేరుడిగా అగ్రస్థానంలో కొనసాగిన అంబానీని, కొన్ని నెలల క్రితం అదానీ వెనక్కి నెట్టారు. అదానీ గ్రూపు కంపెనీ షేర్లు అనూహ్యంగా రాణించడమే అందుకు కారణం. తాజాగా (జూన్ 3న) అదానీని అంబానీ వెనక్కి నెట్టారు. దీంతో భారత్ తో పాటు ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ నిలిచారు.
బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం.. ముఖేశ్ అంబానీ 99.7 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు. 2022లో ఆయన సంపద 9.69 బిలియన్ డాలర్లు ఎగబాకింది. అదే జాబితాలో అదానీ 98.7 బిలియన్ డాలర్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నారు. భారత కుబేరుల జాబితాలో వీరివురు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. గ్లోబల్ బిలియనీర్ లిస్ట్‌లో అంబానీ తర్వాత గౌతమ్ అదానీ ఉన్నారు. మరోవైపు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో 104.3 బిలియన్ డాలర్లతో అంబానీ ఆరో స్థానంలో ఉండగా.. అదానీ 99.9 బిలియన్ డాలర్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నారు.
ఆర్‌ఐఎల్ షేర్లలో పెరుగుదల ముఖేశ్ అంబానీ సంపదను పెంచాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు RIL షేర్లు 16 శాతానికి పైగా పెరిగాయి. రిలయన్స్ షేర్లు గతవారం రోజుల్లో 6.79 శాతం పెరిగాయి. మొత్తంగా 2022లో కంపెనీ షేర్లు 16.61 శాతం పెరిగాయి. ఏడాది వ్యవధిలో ఈ షేర్లు మదుపర్లకు 27శాతం రాబడినిచ్చాయి. ప్రపంచంలో కేవలం ఏడుగురు మాత్రమే ముఖేష్ అంబానీ కంటే ధనవంతులుగా ముందు వరుసలో ఉన్నారు. వారిలో టెస్లా CEO ఎలోన్ మస్క్ $227 బిలియన్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా కొనసాగుతున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అమెజాన్ జెఫ్ బెజోస్ $149 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోనే రెండవ ధనవంతుడుగా ఉన్నాడు.
మరిన్ని వార్తల కోసం..