భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో ఓ సంచలనం సృష్టించింది. అత్యంత చవకగా డేటా, ఉచిత కాల్స్ తో జియో మిగతా ఆపరేటర్లకు సవాల్ విసిరింది. అంతేకాదు, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి దిగ్గజాలను వెనక్కినెట్టి… తక్కువ సమయంలోనే దేశంలో అగ్రగామి టెలికాం సంస్థగా ఎదిగింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ. చైనా కంపెనీ షియోమీ ఆధిపత్యం సాగిస్తున్న స్మార్ట్ ఫోన్ రంగంలో ప్రవేశించడమే కాకుండా, ఉన్నతస్థానానికి చేరుకునేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు.
ఇందుకోసం ముఖేశ్ అంబానీ భారత్ లోని మొబైల్ ఫోన్ తయారీదారులతో చర్చలు జరుపుతున్నారు. అత్యంత తక్కువ ధర రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్ అందించాలన్నది ముఖేశ్ వ్యూహం. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ తో మార్కెట్లో షియోమీకి గట్టి పోటీని ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. అంతేకాదు, వచ్చే రెండేళ్లలో 200 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు అమ్మాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. అంతేకాదు…ముఖేశ్ ఆశిస్తున్నట్టుగా ఈ ఫోన్ రూ.4 వేలకే అందుబాటులోకి వస్తే రిలయన్స్ తీసుకు రానున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమంటున్నారు టెక్ నిపుణులు.