ఇప్పుడంతా డేటా సెంటర్ బూమ్ నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరిగిపోతుండటంతో డేటా సెంటర్ల ఏర్పాటు తప్పనిసరి అయ్యింది. ఇందులో భాగంగా ఎన్నో కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటుకు పోటీ పడుతున్నాయి. డేటా సెంటర్స్ లో ఉన్న అవకాశాలను అందిపుచుకునేందుకు రిలయన్స్ ప్లాన్స్ సిద్ధం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మించనున్నట్లు ప్రకటించింది.
ఈ డాటా సెంటర్ ను గుజరాత్ లోని జామ్ నగర్ లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 3 గిగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ను ఎన్ విడియా (Nvidia Corp) సహకారంతో నిర్మించనున్నారు. డేటా సెంటర్ కు కావాల్సిన సెమీ కండక్టర్స్ ను ఎన్ విడియా అందించనుంది.
అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు ఏఐ ఆధారిత డాటా సెంటర్లను భారీ ఎత్తున్న నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ అతిపెద్ద డాటా సెంటర్ ను ఇండియాలో ఏర్పాటు చేయడం విశేషం. జామ్ నగర్ లో నిర్మించబోయే డాటా సెంటర్ కోసం ప్రత్యేకంగా సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను నిర్మించబోతోంది రిలయన్స్. 3 గిగావాట్ల డాటా సెంటర్ అంటే నిత్యం అంతరాయం లేకుండా కరెంటు సప్లై చేయాల్సి ఉంటుంది.
ఏఐ సర్వీస్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అమెజాన్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పటికే బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. అదే విధంగా ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ సంస్థలు సంయుక్తంగా 500 బిలియన్ డాలర్లతో డేటా సెంటర్ ను నిర్మిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ ను ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ సంస్థ జామ్ నగర్ లో ఏర్పాటు చేయడం విశేషం.
ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ ఏఐ మార్కెట్ కు ఇండియా గట్టి పోటీ ఇవ్వనుంది. ఇంత పెద్ద ప్రాజెక్టుకు 20 నుంచి 30 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం. అయితే ఇప్పటికే 26 బిలియన్ డాలర్లను రిలయన్స్ సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. ఈ డేటా సెంటర్ తో ఇండియాలో వేల కొలది జాబ్స్ రానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.