- నేడు గోదావరిలో తెప్పోత్సవం
- రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారదర్శనం
- లక్ష మంది భక్తులు వస్తారని అంచనా, అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు
భద్రాచలం, వెలుగు : ముక్కోటి ఏకాదశి ఉత్సవాల నిర్వహణకు భద్రాద్రి రామాలయంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించి, శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ధనుర్మాసంలో నిర్వహించే ఈ వేడుకలకు దేశం నలుమూలల నుంచి సుమారు లక్ష మంది భక్తులు వస్తారని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
మౌలిక వసతుల కల్పనపై ఫోకస్
ఉత్సవాల కోసం దేవస్థానం రూ.1.20 కోట్లతోసౌకర్యాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తులకు మౌలిక వసతులు కల్పించడంపైనే ఆఫీసర్లు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో మంచి నీటి సదుపాయంతో పాటు, నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారు. విస్తా కాంప్లెక్స్ పక్కన ఉచిత వసతి కోసం షామియానాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్టాండ్, కల్యాణ మండపం పక్కన, గోదావరి ఒడ్డున స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ వద్ద, తాత్కాలిక వసతులు ఉన్న ప్రతీ చోట మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించారు. ఆంజనేయస్వామి విగ్రహం వద్ద, ఆర్టీసీ బస్టాండ్, విస్తా కాంప్లెక్స్, గోదావరి ఘాట్, కల్యాణ మండపం, ఆలయ ప్రాంగణం, తానీషా కల్యాణ మండపం, సాధువుల మండపం వద్ద వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు సిద్దం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2 వేల మంది పోలీసులతో ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, లడ్డూ కౌంటర్లు, వైకుంఠ ద్వార దర్శనం సెక్టార్లు భక్తులు తెలుసుకునేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. గోదావరి నది వల్ల ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, గజ ఈతగాళ్లు, నాటు పడవలను సిద్ధంగా ఉంచారు. భక్తుల కోసం కల్పిస్తున్న వసతులను కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాం
భక్తులు భద్రాచలంలోకి రాగానే ఆధ్యాత్మిక వాతావరణం కనిపించేలా ఏర్పాట్లు చేశాం. స్వాగత ద్వారాలు, మామిడి ఆకుల తోరణాలు, రాత్రి వేళల్లో విద్యుత్ వెలుగులు, ఆలయ ప్రాంగణం అంతా రంగవల్లులతో తీర్చిదిద్దాం. భక్తులు ఇబ్బందులు పడకుండా సౌలత్‌లు కల్పిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – రమాదేవి, ఈవో