
- రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి టాప్ ప్రయారిటీ
- ఆరు గ్యారెంటీల్లోని 9 స్కీములకు రూ.56,084 కోట్లు
- రూ.3.04 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్లో పల్లెలకు నిధుల వరద పారింది. అత్యధికంగా పంచాయతీరాజ్‌శాఖకు రూ. 31,605 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. రైతు భరోసా కోసం రూ. 18 వేల కోట్లు కేటాయించింది. ఈ రెండు పద్దుల కిందే సుమారు రూ. 50 వేల కోట్లు గ్రామాలకు చేరనున్నాయి. ఇవే కాదు, మెజారిటీ శాఖలకు కేటాయించిన నిధుల్లో చాలాభాగం అటు తిరిగి ఇటు తిరిగి పల్లెబాట పట్టాయి. మొత్తం బడ్జెట్లో 60 శాతం నిధులు గ్రామాల్లోని రైతులు, మహిళలు, యువత సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కేటాయింపులు జరిపింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్‌ను బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 3,04,965 కోట్లతో ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. ఇది గతేడాది కన్నా దాదాపు 5 శాతం అదనం.
పల్లెలు బలపడితేనే రాష్ట్రం బలోపేతమవుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దశాబ్దకాలం పాటు తెలంగాణ ఆర్థిక అరాచకత్వానికి గురైందన్నారు. తొలి ఏడాదిలోనే తమ ప్రజా ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ముందుకు సాగుతున్నదని తెలిపారు. కాగా, పంచాయతీరాజ్‌శాఖ ద్వారా గ్రామాల్లో రోడ్లు, మంచినీళ్లు, ఇతర సౌలతులు కల్పించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇరిగేషన్ శాఖలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, హౌసింగ్‌శాఖ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడ్తామని తెలిపింది. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహిళలకు వడ్డీ లేని రుణాలు లాంటి అంశాలకు తాజా బడ్జెట్లో పెద్దమొత్తంలో నిధులు కేటాయించింది. ఆరు గ్యారెంటీల్లోని 9 స్కీములకు రూ.56,084 కోట్లు కేటాయించగా.. వీటిలో మెజారిటీ లబ్ధి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చేకూరనుంది. గతేడాది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,816 కోట్లు ఇవ్వగా..
ఈసారి అంతకంటే ఎక్కువగా రూ. 31,605 కోట్లు కేటాయించారు. ఈ నిధులను గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, రక్షిత మంచినీటి సరఫరాకు, ఇతరత్రా మౌలికవసతుల కల్పనకు వాడనున్నారు. ఇప్పుడు వ్యవసాయం, సహకారానికి రూ. 24,439 కోట్లు కేటాయించగా, రైతు భరోసా కింద రూ.18 వేల కోట్లు పెట్టారు.రైతు భరోసా ద్వారా దాదాపు 65 లక్షల మంది రైతులకు ఎకరాకు ఏటా రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. మొన్న వానాకాలం కొనుగోళ్ల సందర్భంగా సన్న వడ్ల బోనస్ (క్వింటాల్‌కు రూ. 500)కు రూ.500 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత బడ్జెట్లో ఏకంగా రూ.1800 కోట్లు కేటాయించడం విశేషం. ఇరిగేషన్‌కు రూ.23,373 కోట్లు కేటాయించగా.. ఈ నిధులతో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయనున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల కింద రూ.1,500 కోట్లు, అమ్మ ఆదర్శ కమిటీల కింద రూ.650 కోట్లు, మిషన్ భగీరథ కింద రూ.6 వేల కోట్లు, చేనేత కార్మికులకు రూ.371 కోట్లు, రాజీవ్ యువ వికాసం కింద రూ.6వేల కోట్లు , ఇందిరమ్మ ఇండ్ల కింద రూ.7 వేల కోట్లు, చేయూత పెన్షన్ల కింద రూ.10 వేల కోట్లు, మహాలక్ష్మి ఆర్టీసీ పథకం కింద రూ.4,305 కోట్లు, గృహజ్యోతి కింద రూ.2,080 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రూ.600 కోట్లు, విద్యుత్ సబ్సిడీ రూ. 11,500 కోట్లు, వంద శాతం సోలార్ గ్రామాల కోసం రూ.1500 కోట్లు.. ఇలా నిధుల్లో చాలావరకు నేరుగా , కొన్ని స్కీముల్లో మెజారిటీ వాటా గ్రామీణ ప్రాంతాలకు, అక్కడి రైతులు, మహిళలు, యువతకు అందనున్నాయి.
నగరాల అభివృద్ధికి వెయ్యి కోట్లు
పల్లెలకే కాదు, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద ఏకంగా రూ.17,677 కోట్లు కేటాయించింది. వివిధ నగరాల అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు గతంలో కన్నా ఎక్కువ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈసారి బీసీ సంక్షేమానికి రూ.11,405 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ.11,561 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ.7,522 కోట్లు ప్రతిపాదించింది. ఈ నిధులు గ్రామీణ , పట్టణప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాల ఉపాధికి ఊతం ఇవ్వనున్నాయి. ఇదిలా ఉండగా మూలధన వ్యయం కింద రోడ్లకు, సాగునీటి ప్రాజెక్టులకు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు ఈసారి రూ.36,504 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. కాగా, అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. శాసన మండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ రైజింగ్‌కు ఊతం
పదేండ్ల చీకటి నుంచి వెలుగుల తొవ్వలో తెలంగాణ అడుగులు వేస్తున్నది. 15 నెలల కింద కొలువుదీరిన ప్రజాప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. ప్రజా సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నది. తెలంగాణ రైజింగ్‌కు ఈ బడ్జెట్ ఊతమిస్తుంది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం.- సీఎం రేవంత్‌రెడ్డి