వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం… మెట్ట ప్రాంతం కావడంతో పంటలు సరిగా పండవు. పెట్టుబడి కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక రైతులు ఇబ్బందులు పడేవాళ్లు. ఒకవైపు అప్పుల బాధలు, మరో వైపు ఆకలి బాధలు.. అన్నదాతను ఆగమాగం చేసేవి. ప్రతిసారి వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని ఆశతో ఎదురు చూడడం.. తీరా దిగుబడి రాకపోవడం సాధారణమైపోయింది. ఈ బాధలు భరించలేని రైతన్నకు పురుగుల మందే దిక్కయ్యేది. అందుకే ఈ ప్రాంతంలో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకునేవాళ్లు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారినయ్. రైతుకు మూడు పూటలా ఇంత తిండి దొరుకుతోంది. పిల్లల్ని చదివిస్తున్నరు. ఆ ప్రాంతంలో డెయిరీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. రైతులకు ప్రైవేటు అప్పులు తీసుకునే అవసరమే లేకుండా పోయింది. దీనంతటికి కారణం.. ముల్కనూరు సహకార బ్యాంక్.
నలుగురికీ అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవాలనుకున్నడు ముల్కనూరుకు చెందిన అలిగిరెడ్డి విశ్వనాథరెడ్డి. ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టిందే ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్. దీన్ని 1956 లో 373 మంది రైతులతో మొదలుపెట్టారు. అప్పట్లో ఒక ఉద్యోగి మాత్రమే ఉండేవాడు. 2,300 రూపాయల వాటా ఉండేది. అదే బ్యాంక్‌లో ఇప్పుడు 7,324 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వాటా 16.13 కోట్ల రూపాయలకు పెరిగింది. 136 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఏడాదికి 296.47 కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తోంది. ఇప్పుడు సభ్యుల సంక్షేమం కోసం ఏడు కోట్ల రూపాయలు కేటాయించి మరో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
ఏం చేస్తుంది
సాగు చేసేది రైతే అయినా.. ఆ రైతును వెన్నంటే ఉండి నడిపించేది ఈ సహకార సంఘమే. ఇందులో సభ్యులకు విత్తనం వేసింది మొదలు, పంట చేతికొచ్చే వరకు తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది. పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తుంది. దేశంలో పంటకు గిట్టుబాటు ధర కల్పించేది ముల్కనూర్ సొసైటీ ఒక్కటే. వరి, మొక్కజొన్న, పత్తి రైతులకు ఈ సంవత్సరం ఐదు కోట్ల రూపాయల వరకు బోనస్ కూడా ఇచ్చింది. నాబార్డ్ సహకారంతో ముస్తాఫాపూర్, వంగర, ముత్తారం గ్రామాల్లో 2.45 కోట్ల రూపాయలతో చెక్‌డ్యాంలు కట్టించింది. చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతోంది. సభ్యుల్లో ఎవరు చనిపోయినా.. స్వల్పకాలిక పంట రుణాలపై గరిష్టంగా లక్ష, సాధారణ అప్పులో 20 వేల రూపాయలు మాఫీ చేస్తోంది సొసైటీ. సభ్యుల భర్త/భార్య చనిపోతే దహన సంస్కారాల కోసం డబ్బు కూడా ఇస్తోంది. అలా ఇప్పటికి 152 మందికి 14.88 లక్షల రూపాయలు అందించింది. వీటితో పాటు రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తోంది. ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో రాయితీలో ఆధునిక పనిముట్లు ఇస్తోంది సొసైటీ. రైతుల ఆరోగ్యం విషయంలో కూడా సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది. 2006లో సంఘం పరిధిలో కంటి పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 2,433 మందికి కంటి ఆపరేషన్లు చేయించింది. ఇప్పటి వరకు రైతుల వైద్య ఖర్చుల కోసం 84.92 లక్షలు ఖర్చు చేసింది.
రైతుల పిల్లలకు స్కాలర్‌షిప్
సొసైటీలో సభ్యులుగా ఉన్న రైతుల పిల్లలు చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తోంది ఈ బ్యాంక్. 2008లో విశ్వనాథరెడ్డి వర్ధంతి రోజు మొదలుపెట్టారు ఈ పథకాన్ని. ప్రస్తుతం బీటెక్, బీఫార్మసి, బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ, ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్‌కు స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. పదేళ్లలో 857 మంది స్టూడెంట్స్‌కు 57.12 లక్షల రూపాయలు ఇచ్చింది.