సిద్ధిపేట-ఎల్కతుర్తి హైవేకు ముల్కనూర్ బ్రేక్.. ఆ ఒక్క కిలోమీటరే అడ్డంకి!

సిద్ధిపేట-ఎల్కతుర్తి హైవేకు ముల్కనూర్ బ్రేక్.. ఆ ఒక్క కిలోమీటరే అడ్డంకి!
  • జంక్షన్ వద్ద కోల్పోయే ఆస్తులకు పరిహారంపై క్లారిటీ లేదు 
  • షాపులు, ఇండ్లను నష్టపోయే యజమానుల్లో అయోమయం
  • అమరవీరుల స్తూపం, అంబేద్కర్ విగ్రహ తొలగింపుపైనా ఆందోళనే!

హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు:  సిద్దిపేట -– ఎల్కతుర్తి(ఎన్​హెచ్​-765 డీజీ) జాతీయ రహదారి విస్తరణకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ వద్ద బ్రేకులు పడ్డాయి. ముల్కనూర్​ప్రధాన జంక్షన్ కాగా.. ఇక్కడ పనులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దాదాపు వంద ఫీట్ల మేర రోడ్డును విస్తరించాల్సి ఉండగా.. దాని వెంట ఉన్న షాపులు, ఇండ్ల యజమానుల్లో ఆందోళన నెలకొంది. అంతేకాకుండా మెయిన్​రోడ్డుకు ఆనుకుని అమరవీరుల స్తూపం, అంబేద్కర్​విగ్రహం ఉండగా, వాటిని పక్కకు జరపాలనుకుంటే కూడా వివాదాస్పదమవుతోంది. ఫలితంగా సిద్దిపేట – -ఎల్కతుర్తి రహదారిలో దాదాపు కిలోమీటర్ మేర పనులకు అడ్డంకులు తలెత్తాయి. 

వంద ఫీట్ల మేర విస్తరణ

మెదక్– సిద్దిపేట – ఎల్కతుర్తి వరకు దాదాపు 133 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణానికి(ఎన్​హెచ్ 765 డీజీ) కేంద్రం రూ.1,461 కోట్లు మంజూరు చేసింది. 2023 ఫిబ్రవరిలో పనులు స్టార్ట్ అయ్యాయి. సిద్దిపేట నుంచి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వరకు సుమారు రూ.578.85 కోట్లతో  63.64 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి, దానిని వరంగల్​-– కరీంనగర్​హైవేపై ఎల్కతుర్తి జంక్షన్​ వద్ద కలపాల్సి ఉంది. హనుమకొండ జిల్లాలో 17.5 కిలోమీటర్ల నిర్మించాల్సి ఉండగా ముల్కనూర్ జంక్షన్​వద్ద ఒక కిలోమీటర్​మినహా మిగతా 16.5 కిలోమీటర్ల మేర పూర్తయ్యింది. హైవే పనుల్లో భాగంగా ముల్కనూర్ జంక్షన్​ ను అభివృద్ధి చేయాల్సి ఉండగా ఆఫీసర్లు గతంలోనే వంద ఫీట్ల విస్తరణకు మార్కింగ్​చేశారు. 

కోల్పోయే ఆస్తులకు పరిహారంపై లేని క్లారిటీ

ఆఫీసర్లు చేసిన మార్కింగ్ తో జంక్షన్​పరిధిలో 17 షాపులు, 7 ఇండ్లకు నష్టం కలగనుంది. దీంతో వాటికి నష్ట పరిహారంపై క్లారిటీ లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ముల్కనూర్ ​జంక్షన్​వద్ద దాదాపు పదేండ్ల కింద అమరవీరుల స్తూపం నిర్మించారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇంతవరకు ఓపెనింగ్​కు నోచుకోలేదు. ఇప్పుడు ఆ స్తూపాన్ని మరోచోటుకి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. 

దాని పక్కనే ఉన్న అంబేద్కర్​ విగ్రహాన్ని కూడా తరలించాల్సి ఉంది. వీటిని సమీపంలోని బస్టాండ్ ఆవరణలోకి మార్చేందుకు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే. ఆర్టీసీ అధికారులు మాత్రం ఒప్పుకోవడం లేదని తెలిసింది. అంతేకాకుండా ఆటో స్టాండ్​ను షిఫ్ట్ చేయాల్సి ఉండగా, తమకు స్థలం ఎక్కడ కేటాయిస్తారోనని డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు. దీంతో జంక్షన్​ విస్తరణపై అయోమయం నెలకొంది. ఇంకో నెల రోజుల్లోగా రోడ్డు పనులను మొత్తం కంప్లీట్​చేయాలని ఆఫీసర్లు టార్గెట్​పెట్టుకోగా స్థానికుల్లో భయాందోళన పట్టుకుంది. ఆస్తులు కోల్పోయేవారికి పరిహారంపై క్లారిటీ ఇవ్వాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

పరిహారం ఇచ్చి ఆదుకోవాలి 

జాతీయ రహదారి విస్తరణ పనులకు ముల్కనూర్ జంక్షన్​వద్ద మార్కింగ్ చేశారు. దీంతో  మా షాపును కోల్పోతున్నాం. కానీ అధికారులు ఇంతవరకు పరిహారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు.  నష్టపోయే షాపుల ఓనర్లకు తగు పరిహారం అందించి ఆదుకోవాలి.
–  శ్రీనివాసచారి, 
కిరాణ షాపు ఓనర్, ముల్కనూర్  

స్థలం ఎక్కడ ఇస్తారో చెప్పాలి ముల్కనూర్ జంక్షన్ విస్తరణ పనుల్లో మా షాపును తొలగిస్తమని అధికారులు చెబుతున్నారు. మళ్లీ ఎక్కడ స్థలం కేటాయిస్తారో మాత్రం చెప్పడం లేదు. షాపును తొలగిస్తే ఉపాధి కోల్పోయి రోడ్డున పడతాం. రోడ్డు విస్తరణకు సుముఖత వ్యక్తం చేస్తున్నాం. అయితే.. మాకు తగిన స్థలం కేటాయించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి.
– సతీశ్, సెలూన్ షాప్, ముల్కనూర్