
అసఫ్జాహీలు మొదట్లో ఉద్యోగాల నియామకంలో నామినేషన్ పద్ధతిని పాటించారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో సాలార్జంగ్-1 హైదరాబాద్ సివిల్ సర్వీస్ ఏర్పాటు చేసి వ్యక్తుల శక్తి సామర్థ్యాలు, మెరిట్ ఆధారంగా ఉద్యోగాల్లో నియమించడం ప్రారంభించాడు. సాలర్జంగ్-1 మరణానంతరం ముల్కీ, నాన్ ముల్కీ సమస్యను పరిష్కరిస్తూ 1888లో మహబూబ్ అలీఖాన్ గెజిట్ జారీ చేశాడు. దీంతో పరిస్థితి కొంత వరకు సద్దుమణిగింది. 1901లో కాసన్ వాకర్ నిజాం రాజ్యం లో ఆర్థిక కార్యదర్శిగా నియమించ బడ్డాడు. 1912 వరకు ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశాడు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున నాన్ ముల్కీలను ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించాడు. దీంతో మళ్లీ హైదరాబాద్‌లో ముల్కీ, నాన్‌ముల్కీల సమస్య ఉత్పన్నమైంది.
ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ సూచన మేరకు 1918లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేశాడు. ఇందులో ఉర్దూ బోధనా భాషగా ప్రవేశపెట్టారు. శాస్త్ర గ్రంథాల అనువాదం, నూతన గ్రంథాల రచన కోసం ఉత్తర భారతదేశం నుంచి పండితులను రప్పించగా వారు రచనలో లఖ్నవీ ఉర్దూను ఉపయోగించారు. ఈ కారణంగా భాషాపరంగా ముల్కీ, నాన్ ముల్కీ అనే భావనలు ఏర్పడ్డాయి. దక్కనీ ఉర్దూ ముల్కీగా, లఖ్నవీ ఉర్దూ నాన్ ముల్కీగా పరిగణించబడేది. దక్కనీ ఉర్దూను నాన్ ముల్కీ లఖ్నవీ వారు అవమానించేవారు. దీంతో ఓయూలో దక్కనీ ఉర్దూ, ముల్కీల రక్షణ కోసం స్థానిక ప్రొఫెసర్లు చర్యలు తీసుకున్నారు. ఓయూలో ఉర్దూ ప్రొఫెసర్ డాక్టర్ జోరే దక్కనీ జాతీయవాదం అనే సిద్ధాంతాన్ని తీసుకువచ్చాడు. 1901 నుంచి మహరాజా కిషన్ ప్రసాద్, కాసన్ వాకర్ మధ్య జరిగిన ముల్కీ, నాన్ ముల్కీ పోరుతోపాటు 1918లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత ఉర్దూ భాషలో ముల్కీ, నాన్ ముల్కీ భావనలు ఏర్పడటంతో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. దీని ఫలితమే 1919 ఫర్మాన్.
నిజాం సబ్జెక్ట్ లీగ్
1919 ఫర్మాన్ తర్వాత హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ, నాన్‌ముల్కీ సమస్య పరిష్కారమైంది. 1930వ దశాబ్దంలో పంజాబ్‌కు చెందిన
ఖాన్, సాహెబ్‌లను నేరుగా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నత ఉద్యోగాల్లో నియమించారు. దీనివల్ల స్థానికుల ప్రమోషన్లు దెబ్బతిన్నాయి. మళ్లీ ముల్కీ, నాన్ ముల్కీ సమస్య ఉత్పన్నమైంది. పద్మజానాయుడు, మీర్ హసనొద్దీన్, మందముల నరసింగరావు, బూర్గుల రామకృష్ణారావు, మీర్ అక్బర్ అలీఖాన్ మొదలైనవారు ముల్కీ ఉద్యమాన్ని చేపట్టి స్థానికులకు రక్షణ కల్పించాలని డిమాండు చేశారు. ముల్కీ ఉద్యమకారులకు హైదరాబాద్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి మద్దతు పలికాడు.
1933 ఫర్మాన్
హైదరాబాద్ సంస్థానంలో ఉత్పన్నమైన నాన్ ముల్కీ సమస్యను పరిష్కరించడానికి ఈ ఫర్మాన్ జారీ చేశాడు. దీని ప్రకారం ఉద్యోగ నియామకాల్లో సమర్థవంతమైన, విద్యావంతులైన ముల్కీలకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నాన్ ముల్కీలు ఎంత సమర్థత కలిగిన వారైనా హైదరాబాద్ సంస్థానంలో తాత్కాలికంగా మాత్రమే నియమించబడతారు.
అభినందన సభ
1933 నిజాం ఫర్మాన్ వెలువడిన వెంటనే హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించబడ్డాయి. ఈ ఫర్మాన్ వెలువరించిన నిజాంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముల్కీ ఉద్యమ నాయకులు కుమారి పద్మజానాయుడు, డాక్టర్ లతీఫ్ సయీద్, బూర్గుల రామకృష్ణారావు, మందముల నర్సింగరావు, మీర్ అక్బర్ అలీఖాన్, రాజా ధొండే రాజా, నవాజ్ షంషేర్ జంగ్ మొదలైనవారు పాల్గొని నిజాంకు కృతజ్ఞతలు తెలిపారు.
1933 ముల్కీ ఫర్మాన్ జారీ అయిన తర్వాత అభినందన సభలో వక్తలు ప్రజల హక్కులు కాపాడటానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేయా లని పిలుపు ఇచ్చారు. ముల్కీల హక్కులు కాపాడటం, పౌరసత్వ హక్కులు సంపాదిం చడం, జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రజా సంస్థ అవసరమని భావించిన హైదరాబాద్ ముల్కీ ఉద్యమ నాయ కులు 1934లో నిజాం ప్రజల సంఘం (నిజాం సబ్జెక్ట్స్ లీగ్) అనే సంస్థను స్థాపించారు. దీన్నే ఉర్దూలో జమీయత్ రిఫాయామే నిజాం అంటారు. ఈ సంఘమే 1935లో నిజాం ముల్కీ లీగ్‌గా మారింది. హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదం ఇచ్చింది.
అధ్యక్షుడు: నవాబ్ సర్ నిజామత్ జంగ్
ఉపాధ్యక్షులు: లతీఫ్ , రామచంద్రా నాయక్
కార్యదర్శులు: సయీద్ ఆబిద్ హసన్, బూర్గుల రామకృష్ణారావు, శ్రీనివాసరావు శర్మ
కోశాధికారి: బారిష్టర్ నౌషీర్ చీనాయ్
సభ్యులు: రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి, నవాజ్ షంషీర్ జంగ్, వామన్ నాయక్, అక్బర్ అలీఖాన్, కాశీనాథరావు వైద్య, మాడపాటి హనుమంతరావు, అబుల్ హసన్ సయ్యద్ అలీ, గోపాలరావు వకీలు, వి.వి.జోషీ, శంకరరావు బోర్గాంకర్, జనార్దన్ రావు దేశాయి, అహమద్ మొహ్యద్దీన్, ఖలీలుజ్జమా, మందముల నరసింగరావు, మీర్ హసనొద్దీన్, శ్రీపతిరావు పల్నిట్కర్, నవాబ్ మొయిన్ యార్జంగ్, నవాబ్ బహదూర్ యార్జంగ్.
హైదరాబాద్ స్టేట్ సివిల్ సర్వీస్
1919 ఫర్మాన్ ప్రకారం హైదరాబాద్ స్టేట్ సివిల్ సర్వీస్ నియమ నిబంధనలు రూపొందించారు. ఇవే హైదరాబాద్ స్టేట్ సివిల్ సర్వీస్ రూల్స్‌గా పరిగణించారు. ఈ ఫర్మాన్ ప్రకారం హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిటీ లేదా సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఇది ఒక స్వతంత్ర సంస్థ. దీని నిర్ణయాలపై ఎవరి ప్రభావం ఉండదు. ఈ సంస్థ ఎవరి ప్రమేయం లేకుండా రూల్స్ ప్రకారం సివిల్ సర్వీస్ ఉద్యోగులను ఎంపిక చేసింది. హైదరాబాద్ సివిల్ సర్వీసు పరీక్షలు నిర్వహించి, ఖాళీ స్థానాల్లో ఉద్యోగులను భర్తీ చేసింది. 1938లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సివిల్ సర్వీసుల గురించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించింది. ఇందులో అన్ని శాఖల సెక్రటరీలు సభ్యులుగా ఉంటారు. ఆర్థికశాఖ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆర్థిక శాఖలోని ఒక అధికారి కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఈ కమిటీ పూర్తిస్థాయి చర్చలు జరిపిన అనంతరం స్వతంత్ర రిక్రూట్మెంట్ సంస్థను ఏర్పరచాలని నివేదిక ఇచ్చింది.