దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన రాష్ట్రాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. పది రాష్ట్రాలను గుర్తించి మల్టీ డిసిప్లినరీ సెంట్రల్ టీమ్స్‌ను పంపాలని నిర్ణయం తీసుకుంది. కేరళ, గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, మిజోరం, కర్నాటక, బీహార్, యూపీ, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ టీమ్స్ పర్యటించనున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మూడు నుంచి ఐదు రోజుల పాటు పర్యటించి.. వ్యాక్సినేషన్ స్పీడప్ చేయడంతో పాటు, కొత్త వేరియంట్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నట్లు పేర్కొంది.
"...A decision has been taken to deploy multi-disciplinary Central teams to 10 identified States some of which are either reporting an increasing number of #Omicron & COVID19 cases or slow vaccination pace...," says Union Health Ministry in an official statement
— ANI (@ANI) December 25, 2021
కాగా, భారత్‌ను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. దేశంలో మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు భారత్ లో 415 పాజిటివ్ కేసులను గుర్తించారు. 115 మంది ఒమిక్రాన్ బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. అత్యధికంగా మహారాష్ట్రలో 108, ఢిల్లీలో 79 కేసులు ఉన్నాయి. కేరళ, తెలంగాణలోనూ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 20, గుజరాత్ లో 13, ఏపీలో రెండు కేసులు నమోదయ్యాయి. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూ, జనసమూహాలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. దీంతో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై పలురాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఢిల్లీలో ఇవాళ చర్చిలను మూసివేశారు. మహారాష్ట్రలో ఆంక్షల మధ్య వేడుకలు కొనసాగుతున్నాయి. దేశంలో 89శాతం మంది వయోజనులు మొదటిడోసు తీసుకున్నారని కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు 141 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇక ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ గరిష్టానికి చేరుకుంటుందని ఐఐటీ కాన్ఫూర్ నిపుణులు తెలిపారు. సెకండ్ వేవ్ తో పోల్చితే ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా 108 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటివరకు దాదాపు లక్షా 5 వేల మందికి ఈ వేరియంట్ సోకింది. అందులో ఒక్క యూకేలోనే 90 వేల కేసులు ఉన్నాయి. డెన్మార్క్ లో 30 వేల మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ తో మరణించిన వారు 26 మంది ఉన్నారు.