హైదరాబాద్: మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ వ్యాపారాలను విస్తరించడానికి భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రాపర్టీలను లీజుకు లేదా కిరాయికి తీసుకుంటున్నాయి. ఇటీవల, హైదరాబాద్‌లో టాప్ ఎంఎన్‌సీలు నగరంలో 8.7 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. వీటికి అద్దె రూ. 70 లక్షల నుంచి రూ. 3.15 కోట్ల వరకు ఉన్నట్లు రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ ప్రాప్‌స్టాక్ తెలిపింది.
గత నెల 28న ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. క్వాల్‌కామ్ ఇండియా, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఐబీఎమ్ ఇండియా, ఎస్ అండ్ పి క్యాపిటల్ ఐక్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని స్థలాలను లీజుకు తీసుకున్నాయి. మరో రియల్ఎస్టేట్కన్సల్టెన్సీ అనరాక్ రీసెర్చ్ ప్రకారం, హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 2021–2024 మధ్య బలమైన వృద్ధిని ప్రదర్శించింది. సుమారుగా 2,18,800 కొత్త రెసిడెన్షియల్ యూనిట్లు ప్రారంభమయ్యాయి. దీంట్లో 154,300 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023 సంవత్సరంలో దాదాపు 76,300 యూనిట్లు అందుబాటులోకి రాగా, 61,700 యూనిట్లు అమ్ముడయ్యాయి.
క్వాల్‌కామ్ లీజు 4.14 లక్షల చదరపు అడుగులు
అమెరికాకు చెందిన చిప్‌మేకర్ క్వాల్కామ్ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.3.15 కోట్ల నెలవారీ అద్దెతో హైటెక్ సిటీలోని బిజినెస్ హబ్‌లో 4.14 లక్షల చదరపు అడుగుల జాగాను లీజుకు తీసుకుంది. స్కైవ్యూ భవనంలోని ఐదు అంతస్తులలో కార్యాలయ యూనిట్లు ఉన్నాయి. కంపెనీ రూ. 16.4 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను చెల్లించింది. ఐదేళ్ల లీజు ఫిబ్రవరి 12, 2024న ప్రారంభమైంది. దివిజ కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ఎంజెడ్ కార్ప్‌లు ఈ ప్రాపర్టీకి యజమానులు. మరో అమెరికా కంపెనీ ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దివ్యశ్రీ ఓరియన్‌లో 1.06 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది.
ఇది గచ్చిబౌలి ప్రాంతంలోని 26 ఎకరాల క్యాంపస్. కంపెనీ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.4.21 కోట్లు చెల్లించింది. నెలవారీ అద్దె రూ.70.23 లక్షలు. మిడాస్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీని యజమాని. కార్యాలయ స్థలం 10వ, 11వ అంతస్తుల్లో ఉంది. ఎస్అండ్పీ క్యాపిటల్ ఐక్యూ ఇండియా 2.41 లక్షల చదరపు అడుగుల జాగాను లీజుకు తీసుకుంది. స్కైవ్యూలోని ఈ బిల్డింగ్ అద్దె నెలకు రూ.1.77 కోట్లు. కంపెనీ రూ. 10.6 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ని చెల్లించింది.
ఈ ప్రాపర్టీ యజమాని దివిజా కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ 1.09 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. ఈ ఆఫీసు కూడా స్కైవ్యూ బిల్డింగ్‌లోనే ఉంది. అద్దెగా రూ. 89.18 లక్షలు చెల్లిస్తుంది. రూ.6.2 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ కట్టింది. 14వ, 15వ అంతస్తుల్లో కార్యాలయ యూనిట్లు ఉన్నాయి. దివిజ కమర్షియల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ఎంజెడ్ కార్పొరేషన్ ఈ ప్రాపర్టీ యజమానులు.