ప్రజల ప్రాణాలతో చెలగాటం..మల్టీ స్పెషాలిటీ పేరిట దోపిడీ

  •     క్వాలిఫైడ్ డాక్టర్లు అంటూ బోర్డులు, ట్రీట్మెంట్ చేసేది ఆర్ఎంపీలు 
  •     తనిఖీల్లో బయటపడుతున్న హాస్పిటళ్ల భాగోతం
  •     నెల రోజుల్లో 6  హాస్పిటల్స్ సీజ్

సూర్యాపేట, వెలుగు : జిల్లాలో మల్టీ స్పెషాలిటీ పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పైకి క్వాలిఫైడ్ డాక్టర్లు అంటూ బోర్డులు పెట్టి లోపల మాత్రం ఆర్ఎంపీలతో ట్రీట్మెంట్ చేస్తూ పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల వైద్యారోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషలిస్ట్ డాక్టర్లు లేకుండా ఆర్ఎంపీలే పేషెంట్లకు వైద్యం అందిస్తున్న 6  హాస్పిటల్స్ ను వైద్యాధికారులు సీజ్ చేశారు.  

మల్టీ స్పెషాలిటీ పేరిట దోపిడీ.. 

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ పేరిట కొంతమంది ఆర్ఎంపీలు పేషెంట్ల నుంచి విచ్చలవిడిగా డబ్బులు వసూళ్లు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్ల పేరుతో హాస్పిటల్స్ ను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. అక్కడ కనీసం ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఉండడం లేదు. జిల్లా కేంద్రంలో ఇటీవల కొన్ని హాస్పిటల్స్ లో క్వాలిఫైడ్ డాక్టర్లతో ట్రీట్మెంట్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.

దీనిని నమ్మి పేషెంట్లు హాస్పిటల్స్​కు వెళ్తే వారిని నిట్టనిలువునా దోచుకుంటున్నారు. సూర్యాపేటతోపాటు కోదాడ, హుజూర్ నగర్ లో ఆర్ఎంపీలే డాక్టర్లుగా చెలామణి అవుతూ ఏకంగా అబార్షన్లు చేస్తున్నారు. ఇటీవల హుజూర్ నగర్ లో 7 నెలల గర్భిణికి ఆర్ఎంపీ అబార్షన్ చేయగా తీవ్ర రక్తస్రావమై ఆమె మృతి చెందింది. 

స్కానింగ్ సెంటర్లతో ఒప్పందాలు.. 

ఆర్ఎంపీలు స్కానింగ్ సెంటర్లతో చేతులు కలిపి యాథేచ్చగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల, మగ పిల్ల అని తెలుసుకొని ఆడపిల్ల అయితే అబార్షన్ కు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. కోదాడ, హుజూర్ నగర్, సూర్యాపేటలో కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండానే స్కానింగ్ సెంటర్లు నిర్వహిస్తూ  లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న వాటిపై చర్యలకు వైద్యారోగ్యశాఖ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.

మరోపక్క జిల్లా కేంద్రంలోని కొంతమంది మహిళా డాక్టర్లు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేటకు చెందిన ఒక మహిళా డాక్టర్ ఏకంగా నెలలో 98 అబార్షన్లు చేయడం గమనార్హం.

పట్టించుకోని హెల్త్ డిపార్ట్ మెంట్.. 

జిల్లాలో పలు హాస్పిటళ్లపై ఆరోపణలు వస్తున్నా వైద్యాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. హాస్పిటల్స్​లో సరైన సౌకర్యాలు ఉన్నాయా..? స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారా..? రూల్స్ పాటిస్తున్నారా లేదా.. అని చూడకుండానే పర్మిషన్లు ఇస్తున్నారు. దీనితో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఒక్క జిల్లా కేంద్రంలోనే దాదాపు 20 పైగా డాక్టర్లు లేకుండానే ఆర్ఎంపీలే ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు సమాచారం. గతంలో కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు చేపట్టిన ఆఫీసర్లు పర్మిషన్లు లేని హాస్పిటళ్లను సీజ్ చేశారు. ఆ తరువాత బోర్డు మార్చి ట్రీట్మెంట్ అందిస్తుండడంతో సైలెంట్ అయ్యారు. 

నెల రోజుల్లో 6  హాస్పిటల్స్ సీజ్.. 

ఇటీవల హెల్త్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించి ఆర్ఎంపీలు ట్రీట్మెంట్ చేస్తున్న 6 హాస్పిటల్స్ ను సీజ్ చేశారు. సూర్యాపేటలో 4 హాస్పిటల్స్, కోదాడలో 1, హుజూర్ నగర్ లో 1 హాస్పిటల్ ను సీజ్ చేశారు. మరో 12 హాస్పిటల్స్ కు జరిమానా విధించారు. 

చర్యలు తీసుకుంటాం 

అర్హత గల డాక్టర్లు లేకుండా హాస్పిటల్స్ నడిపించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని హాస్పిటల్స్​ను సీజ్ చేస్తాం. ఇటీవల చేసిన తనిఖీల్లో ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరని, ప్రభుత్వ డాక్టర్లు కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారని గుర్తించాం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు ఇవ్వకుండానే ఆస్పత్రులను సీజ్ చేస్తాం.   

- డాక్టర్ కోటాచలం, డీఎంహెచ్ వో