
పదోతరగతితో సెంట్రల్లో మంచి కొలువులో స్థిరపడేందుకు ఎస్‍ఎస్‍సీ మంచి నోటిఫికేషన్‌తో సిద్ధం అవుతోంది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం త్వరలో విడుదల చేయనున్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) నోటిఫికేషన్ మీ కోసమే. కేవలం పది పాసైతే చాలు పదిలమైన కెరీర్ సొంతం చేసుకునే అద్భుత అవకాశం ఇది. గ్రూప్-సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులుగా పిలిచే ఎంటీఎస్ ఉగ్యోగానికి ఎంపికయితే ప్రారంభంలోనే మంచి వేతనం పొందవచ్చు. ఈ నేపథ్యంలో సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ప్రిపరేషన్ తెలుసుకుందాం..
ఎంటీఎస్ ఎగ్జామ్ పదోతరగతి అర్హతతో నిర్వహించే పరీక్షే అయినప్పటికీ పీజీ, పీహెచ్‍డీలు చేసిన వారు సైతం పోటీ పడుతుండటంతో పోటీ ఎక్కువగానే ఉంటుంది. ప్రశ్నలన్నీ పదోతరగతి నుంచి ఇంటర్ స్థాయిలోనే ఉంటాయి. ముఖ్యంగా పరీక్ష సెషన్స్ వారీగా నిర్వహిస్తారు కాబట్టి ముందుగా పరీక్ష రాసిన స్నేహితులు, అభ్యర్థులు ద్వారా పరీక్షలో వచ్చిన ప్రశ్నలు, వాటి సరళిని తెలుసుకొని వాటికి సమాంతరంగా ప్రిపేరవ్వాలి.
అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: కొన్ని పోస్టులకు 18 నుంచి 25, మరికొన్నింటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, ఎక్స్‌సర్వీస్‍మెన్‍లకు 3, పీడబ్ల్యూడీలకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. పూర్తి వివరాల కోసం www.ssc.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.
విధులు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్‍లు కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాలు, ఉన్నతాధికారుల వద్ద అన్ని రకాల రోజువారీ కార్యకలాపాలు, ఆఫీస్ పనులు చేయాల్సి ఉంటుంది. టెక్నికల్‍గా వీరిని ఆఫీస్ అటెండెంట్స్ అని చెప్పవచ్చు. సెక్షన్/యూనిట్‍ను శుభ్రం చేస్తూ నీట్‍గా ఉంచడం, ఫైల్స్, రికార్డులు మెయింటెన్ చేయడం, ఫ్యాక్స్ పంపడం, జిరాక్స్, ప్రింట్స్ తీయడం, డైరీ మెయింటెయిన్, డిస్పాచ్, పోస్టులు పంపడం, సెక్షన్‍ను భద్రంగా చూసుకోవడం, వాహనాలు నడపడంతో పాటు పై అధికారులు చెప్పిన అన్ని రకాల విధులు నిర్వర్తించాలి.
ప్రమోషన్స్: మూడేళ్ల కాలంలోనే మొదటి ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. పనితీరు ఆధారంగా ఐదేళ్లలోనే మూడు నుంచి నాలుగు ప్రమోషన్లు పొందవచ్చు. వీరికి సాధారణంగా ప్యూన్, డఫాట్రీ, జామ్‍దార్, ఫరాస్, చౌకీదార్, సఫాయివాలా, మాలి, జూనియర్ ఆపరేటర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ కేటాయిస్తారు. ఏ రాష్ర్టంలో ఉద్యోగం కోరుకుంటున్నామో దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి.
సిలబస్ & ప్రిపరేషన్ టిప్స్
ఇంగ్లీష్ లాంగ్వేజ్: ప్రాథమికంగా ఇంగ్లీష్ భాషపై అభ్యర్థికి గల అవగాహనను పరీక్షించేలా ఇందులో ప్రశ్నలిస్తారు. వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ర్టక్చర్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, వాటి ఉపయోగం మరియు రాత నైపుణ్యం (రైటింగ్ ఎబిలిటీ) టెస్ట్ చేస్తారు. ఇందుకుగాను ప్రీవియస్ పేపర్లలో వచ్చిన ప్రశ్నల ఆధారంగా ఏదైనా స్టాండర్డ్ బుక్ ఇంటర్నెట్‍లో లభించే ఆంటోనిమ్స్, సినానిమ్స్ లిస్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. డిక్షనరీ సహాయంతో చదువుతూ రోజుకు కొన్ని కొత్త పదాలు, వాక్యాలు సాధన చేయాలి. వొకాబులరీతో పాటు గ్రామర్ పెంచుకోవాలంటే ఇంగ్లీష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం ఉత్తమ మార్గం.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: ఈ విభాగంలో ఉద్యోగంలో నిర్వర్తించాల్సిన విధులపై నాలెడ్జ్ టెస్ట్ చేసేలా నాన్‍వర్బల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లం సాల్వింగ్, అనాలసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమొరీ, డిస్ర్కిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్‍షిప్స్ కాన్సెప్ట్స్, ఫిగర్ క్లాసిఫికేషన్, ఆర్థమెటికల్ నంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్ వంటి టాపిక్‍లను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా అభ్యర్థి ఆలోచనలు, సింబల్స్, వాటిని గుర్తించడం, అర్థమెటిక్ కంప్యూటేషన్ వంటి అంశాలను పరీక్షిస్తారు.
ప్రాక్టీస్ తోనే మంచి మార్కులు పొందవచ్చు. దీనికి ఆర్‍ఎస్ అగర్వాల్ రీజనింగ్ పుస్తకంతో పాటు ఎస్‍ఎస్‍సీ ఇతర పరీక్షల ప్రీవియస్ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్ ప్యాటర్న్ తెలుస్తుంది.న్యూమరికల్ ఆప్టిట్యూడ్: నంబర్ సిస్టమ్స్, వోల్ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సంఖ్యల మధ్య సంబంధం, బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్లు, టేబుల్స్, గ్రాఫ్‍లు, మెన్సురేషన్, కాలం-దూరం, నిష్పత్తి-కాలం, కాలం-పని వంటి టాపిక్‍ల నుంచి ప్రశ్నలిస్తారు. ముందుగా సిలబస్‍లో ఉన్న టాపిక్‍లను బాగా ప్రాక్టీస్ చేయాలి. సమయం ఉంటే ఇతర టాపిక్‍లు నేర్చుకోవాలి. ప్రీవియస్ పేపర్లను అవగాహన చేసుకుంటే ప్రిపరేషన్ సులువవుతుంది.
జనరల్ అవేర్‍నెస్: జనరల్ అవేర్‍నెస్ విభాగం చాలా విస్తృతమైనది. కరెంట్ అఫైర్స్ లో అంతర్జాతీయ, జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు, సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం మూడు నెలల ముందు నుంచి తప్పకుండా చదవాలి. జనరల్ నాలెడ్జ్‌లో దేశాల రాజధానులు, అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి జియోగ్రఫీ అంశాలు ముఖ్యమైనవి. చరిత్రలో బ్రిటిషు పాలన, స్వాతంత్ర్య పోరాటం, బ్రిటిషు గవర్నర్ జనరల్స్, స్వాతంత్ర్య సమరయోధులు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇండియన్ పాలిటీలో తాజా నియామకాలు, రాజకీయ పరిణామాలు, పథకాలు, చట్టాలు, బిల్లులు వంటి వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. నిత్యజీవితంలో ఎదురయ్యే సైన్స్ అంశాలైన రసాయనాలు, భౌతిక సూత్రాలు, శరీరధర్మ శాస్ర్తం, వ్యాధులు, వైరస్‍లు, మొక్కలు - ఉపయోగపడే భాగాలు వంటి అంశాలను చదువుకోవాలి. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలుంటాయి కాబట్టి వీటికి ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, పదోతరగతి పుస్తకాలను చదవాలి.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షలో ఆబ్జెక్టివ్ అండ్ డిస్ర్కిప్టివ్ అనే రెండు పేపర్లుంటాయి. ఆన్‍లైన్ లో నిర్వహించే ఆబ్జెక్టివ్ పేపర్ లో నాలుగు సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలిస్తారు. సమయం 90 నిమిషాలు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు మైనస్ అవుతుంది. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ (ఇంగ్లీష్ కు తప్ప) భాషల్లో ముద్రిస్తారు. పేపర్-I లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే రెండో దశలో వ్యాసరూప సమాధాన పరీక్ష (డిస్ర్కిప్టివ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో షార్ట్ ఎస్సే, లెటర్ ఇన్ ఇంగ్లీష్ టాపిక్స్ మీద ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 50. సమయం 30 నిమిషాలు. ఇంగ్లీష్, హిందీ లేదా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో పేర్కొన్న ఏదైనా ప్రాంతీయ భాషలో సమాధానాలు రాయవచ్చు. అక్షర దోషాలు, పంక్చుయేషన్ మార్క్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. పేపర్-I మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితా తయారు చేస్తారు. వివిధ షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు కాబట్టి నార్మలైజేషన్ పద్ధతి ఉపయోగిస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఒకే మార్కులు వస్తే పేపర్-II లో వచ్చిన మార్కులను చూస్తారు. అందులోనూ సమాన మార్కులుంటే పుట్టిన తేది, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పేరు వంటివి చెక్ చేస్తారు.