![సర్వేను అడ్డుకుంటే కఠిన చర్యలు : ఐజీ సత్యనారాయణ](https://static.v6velugu.com/uploads/2025/02/multi-zone-2-ig-satyanarayana-suggested-that-the-land-survey-related-to-the-narayanpet-kodangal-lift-irrigation-scheme-be-completed_63rG4RTmP1.jpg)
నారాయణపేట, వెలుగు : నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన భూ సర్వేను పూర్తి చేయాలని మల్టీ జోన్–-2 ఐజీ సత్యనారాయణ సూచించారు. సోమవారం నారాయణపేటకు వచ్చిన ఐజీకి జోగులాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేశ్ గౌతమ్ బొకే అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కొడంగల్ లిఫ్ట్ భూ సర్వేపై చర్చించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం భూ సర్వే చట్ట ప్రకారం జరుగుతుందని, సర్వే సమయంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు.
సర్వే చేసే సమయంలో అసలు భూమి లేని వాళ్లే ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. మొదటి దశ భూ సర్వే జరిగే సమయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నోటిఫికేషన్ నుంచి 60 రోజుల లోపు ఆర్డీవో, కలెక్టర్ కు తమ అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. రూల్స్ ప్రకారం జిల్లాలో కొనసాగుతున్న సర్వేను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తే తగిన చర్యలు తీసుకోవాలన్నారు.