తాజ్​మహల్​కు పగుళ్లు

తాజ్​మహల్​కు పగుళ్లు

ఆగ్రా: ఐకానిక్ కట్టడం.. ఆగ్రాలోని తాజ్​మహల్​పై పగుళ్లు కనిపించాయి. మహల్ గోడలు, కింది భాగంలోని అంచులపొంటి కూడా పలుచోట్ల పగుళ్లు వచ్చాయి. ప్రధాన డోమ్​కు దగ్గరలోనూ ఓ మొక్క మొలిచింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతవారంలో మహల్ పరిసరాల్లో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు ప్రధాన డోమ్​లోంచి నీళ్లు లీక్ అయ్యాయి.

వరద ఉధృతికి యమునా నది మహల్ గోడను తాకుతూ ప్రవహించింది. మహల్ ఎదురుగా ఉన్న గార్డెన్ కూడా వరదనీటితో మునిగిపోయింది. ఇది జరిగి వారం గడవకముందే డోమ్​పై మొక్క పెరగడం, గోడలకు పగుళ్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై ఆగ్రా సర్కిల్ పురావస్తు శాఖ అధికారిని మీడియా ప్రశ్నించగా.. తాజ్ మహల్ మాత్రమే కాదు, స్మారక చిహ్నాలన్నింటి మూలల్లో మొక్కలు పెరగడం కామన్ అని చెప్పారు. అవి మొలకెత్తడం గమనించిన వెంటనే తొలగిస్తామని తెలిపారు.