- ఆరోగ్యశ్రీ, హెల్త్ అకౌంట్‌కు లింకు
- ఇదే నంబర్‌తో దవాఖాన్లలో ఓపీ రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు త్వరలోనే మల్టీపర్పస్ హెల్త్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఆరోగ్యశ్రీ స్కీమ్, దవాఖాన్లలో ఓపీ రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగపడేలా యూనిక్ నంబర్‌తో ఈ కార్డులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రజలందరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఆరోగ్య శ్రీ కూడా ఉంది. ఆ స్కీమ్‌కు పునరుజ్జీవం పోసేందుకు ఇటీవలే ప్యాకేజీల ధరలను 20 శాతం మేర పెంచారు. రేషన్ కార్డులు లేకపోవడం వల్ల చాలా మంది స్కీమ్‌కు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీకి రేషన్‌కార్డుకు లింకును తొలగించాలని నిర్ణయించారు. కొత్తగా 163 రకాల ప్రొసీజర్లను స్కీమ్‌లో చేర్చారు.
దవాఖాన్లకూ లింకు
స్టేట్ హెల్త్ ప్రొఫైల్ పేరిట హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్ కోసం గత సర్కార్ ప్రయత్నించింది. ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించి, ప్రజలందరికీ రకరకాల టెస్టులు చేయించింది. తర్వాత కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ డిజిటలైజేషన్‌పై దృష్టి పెట్టింది. గత సర్కార్‌లో చేసినట్టుగా ఇంటింటికీ వెళ్లి ఒకేసారి లక్షల మందికి టెస్టులు చేయించడానికి బదులు, క్రమక్రమంగా డిజిటలైజేషన్ చేపట్టాలని భావిస్తున్నది.
తొలుత జనాలకు యూనిక్ నంబర్లతో డిజిటల్ కార్డులను ఇచ్చి, తర్వాత జనాలకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటల్‌కు వచ్చినప్పుడు అదే నంబర్‌లో వారి ఓపీ, ఐపీ రిజిస్ట్రేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నది. అదే నంబర్‌తో వారి పేరిట డిజిటల్ హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసి, వారు చేయించుకున్న టెస్టుల రిపోర్టులను, వారికి డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ కాపీలను ఆ డిజిటల్ హెల్త్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. ఈ హెల్త్ అకౌంట్లను ఓపెనింగ్‌కు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉండేలా సాఫ్ట్‌వేర్ రూపొందిస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ దవాఖానకు పోయినా, ప్రైవేటు దవాఖానకు పోయినా రోగుల అనుమతితోనే హెల్త్ అకౌంట్ ఓపెన్ చేయనున్నారు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్‌కు కూడా డిజిటల్ హెల్త్ అకౌంట్ ఉపయోగపడుతుందని, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం ఈ తరహా విధానం అమల్లో ఉందని డాక్టర్లు చెబుతున్నారు. పేషెంట్ హెల్త్ హిస్టరీని చెక్ చేయడం ఈజీ అవుతుందని, తద్వారా తక్కువ టైమ్‌లోనే డయాగ్నోసిస్ చేసి, ట్రీట్‌మెంట్ ప్రారంభించొచ్చునని అంటున్నారు.