చదువు అంటే పెద్దగా ఇష్టం లేదు. కానీ.. కళలంటే ప్రాణం. అందుకే చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టి, సితార్ వాయించడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత స్టాండప్ కామెడీ ద్వారా జనాలను నవ్వించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగిపోలేదు. అందర్నీ ఆలోచింపజేసే కవిత్వం రాశాడు. ఇప్పుడు వెబ్ సిరీస్‌లకు స్క్రిప్ట్ రాస్తున్నాడు మల్టీటాలెంటెడ్ జాకీర్ ఖాన్. ఒక వైపు స్టాండప్ కమెడియన్‌గా సత్తా చాటుతూనే యూట్యూబర్, యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన జాకీర్ ఖాన్ ఇండియాలోని టాప్ స్టాండప్ కమెడియన్లలో ముందు వరుసలో ఉంటాడు. జాకీర్ కామెడీని ముఖ్యంగా యువత బాగా ఇష్టపడతారు. అతను కమెడియన్ మాత్రమే కాదు.. రచయిత, కవి, యాక్టర్. 2012లో ‘కామెడీ సెంట్రల్ ఛానెల్’ పెట్టిన పోటీల్లో బెస్ట్ స్టాండప్ కమెడియన్‌గా గెలిచాడు. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ ఫ్లాట్స్‌ఫామ్స్ నిర్మించిన వెబ్ సిరీస్‌ల్లో నటించాడు. ‘చాచా విధాయక్ హై హమారే’ అనే వెబ్ సిరీస్‌కి స్క్రిప్ట్ కూడా రాశాడు. జాకీర్ చేసిన స్టాండప్ కామెడీ వీడియోలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్నాయి.
బీకాంలో చేరి..
జాకీర్1987 ఆగస్టు 20న పుట్టాడు. సెయింట్ పాల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నాడు. డిగ్రీలో బీకాం కోర్సులో చేరాడు. కానీ.. మధ్యలోనే మానేశాడు. తర్వాత సితార్ ప్లే చేయడంలో డిప్లొమా చేశాడు. జాకీర్ తండ్రి ఇస్మాయిల్ ఖాన్, తల్లి కుల్సుమ్ ఖాన్, తాత ఉస్తాద్ మొయినుద్దీన్ ఖాన్ సంగీత విద్వాంసులు. తండ్రి మ్యూజిక్ టీచర్‌గా పనిచేసేవాడు. అతని సోదరుడు కూడా సింగర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
స్టాండప్ కామెడీ
డిప్లొమా చేసిన తర్వాత స్టాండప్ కామెడీ మీద అతనికి ఉన్న ఇష్టంతో ‘ఇండియాస్ బెస్ట్ స్టాండ్ అప్’ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశాడు. దాంతో అతనికి చాలామంచి పేరొచ్చింది. స్టాండప్ కామెడీ క్లబ్స్‌లో ప్రదర్శనలు ఇవ్వడంతోపాటు రేడియో షోల్లో పార్టిసిపేట్ చేశాడు. ఆ తర్వాత ఎన్‌డీటీవీలో ‘ది రైజింగ్ స్టార్స్ ఆఫ్ కామెడీ’ అనే ప్రోగ్రామ్ ద్వారా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉర్దూలో కవిత్వాలు కూడా రాస్తుంటాడు. జాకీర్ ఖాన్ మొదటి కవితను రైల్లో ఢిల్లీకి జర్నీ చేస్తున్నప్పుడు రాశాడు. దానిపేరు ‘మై శూన్య పే సవార్ హూ’ని ఒక రైలు ప్రయాణంలో రాశాడు.
యూట్యూబ్‌లోకి..
జాకీర్ 2011లోనే ‘జాకీర్ ఖాన్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. కానీ.. వీడియోలు మాత్రం స్టాండప్ కమెడియన్ అయిన తర్వాతే పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. 2015లో మొదటి వీడియో పోస్ట్ చేశాడు. మొదట్లో అందరు యూట్యూబర్లలాగే కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. వ్యూస్ అంతగా వచ్చేవి కాదు. సబ్‌స్క్రయిబర్ల సంఖ్య కూడా పెరగలేదు. కానీ.. కొన్నాళ్లకు నెమ్మదిగా సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది.
ప్రస్తుతం ఛానెల్‌కు 7.76 మిలియన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఛానెల్‌లో 191 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. ఛానెల్‌లో 10 మిలియన్ల వ్యూస్ దాటిన వీడియోలు చాలానే ఉన్నాయి. ఒక వీడియోకైతే ఏకంగా 81 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తోంది.
మల్టీ టాలెంటెడ్
జాకీర్ కామెడీతోపాటు యాక్టింగ్ చేస్తాడు. పాటలు పాడతాడు. వాస్తవానికి అతను రేడియోలో ప్రొడ్యూసర్ కావాలి అనుకున్నాడు. అందుకే ఒక ఏడాది రేడియో ప్రోగ్రామింగ్ నేర్చుకుని, ఢిల్లీకి వెళ్లాడు. కానీ.. ఆ రంగంలో నిలదొక్కుకోవడం జాకీర్‌కి చాలా కష్టమైంది. అయినా.. రేడియోలో పనిచేయడం ఒక సవాల్‌గా తీసుకున్నాడు. కానీ.. ఫ్యామిలీలో అతని ఫ్యూచర్ గురించి ఆందోళన మొదలైంది.
దాంతో వాళ్లను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఇంటి నుంచి డబ్బు తీసుకోవడం మానేశాడు. ఇంట్లోవాళ్లకు ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. డబ్బు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొన్నిసార్లు కూలీ పనులు కూడా చేసేవాడు. ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బు ఉండేది కాదు. అప్పుడే స్టాండప్ కామెడీ మొదలుపెట్టాడు. ఆ తర్వాత సితార్ వాయించాడు. అలా ఒకసారి ఆల్ ఇండియా రేడియోలో ప్రదర్శన ఇచ్చే అవకాశం వచ్చింది. ఆ ప్రదర్శన తర్వాత అతనికి ఆఫర్‌లు రావడం మొదలయ్యాయి.
చివరికి హెచ్‌టీ రేడియోలో ఉద్యోగంలో చేరాడు. కానీ.. అతని రూమ్మేట్ విశ్వాస్ స్టాండప్ కామెడీ చేయాలని ఎంకరేజ్ చేసేవాడు. దాంతో ఢిల్లీలోని కేఫ్స్‌లో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అక్కడివాళ్లు అతని జోక్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్లు. ఆ తర్వాత ముంబయికి చెందిన ‘ఆన్ ఎయిర్ విత్ ఏఐబీ’లో కామెడీ న్యూస్ సెటైర్ ప్రోగ్రామ్‌కి స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.