చక్రయ్యగౌడ్ హత్య కేసును త్వరలో ఛేదిస్తాం : ఐజీ సత్యనారాయణ

చక్రయ్యగౌడ్ హత్య కేసును త్వరలో ఛేదిస్తాం  :  ఐజీ సత్యనారాయణ
  • మల్టీజోన్ -2 ఐజీ సత్యనారాయణ

తుంగతుర్తి, వెలుగు : మాజీ సర్పంచ్ చక్రయ్యగౌడ్ హత్య కేసును త్వరలో ఛేదిస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మల్టీజోన్ –2 ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య కుటుంబ సభ్యులను ఎస్పీ నరసింహతో కలిసి ఐజీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచ్ హత్యలో సొంత బంధువుల హస్తం ఉన్నట్లు గుర్తించామని, సొంత అల్లుళ్లే ప్రాధాన పాత్ర పోషించారని తెలిపారు.

 ఇంకా విచారణ కొనసాగుతుందని, ఏ ఒక్కరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు. ఎస్పీ నరసింహ పర్యవేక్షణలో 5 ప్రత్యేక టీములను ఏర్పాటు చేశామని, త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారి వెంట అడిషనల్ ఎస్పీ మేక నాగేశ్వరరావు, డీఎస్పీ జి.రవి, సీఐ శీను, ఎస్ఐ మహేంద్రనాథ్ తదితరులు ఉన్నారు.