ములుగు, వెలుగు : వానాకాలం పండించిన ధాన్యాన్ని సకాలంలో సేకరించడంతోపాటు సీఎంఆర్ సకాలంలో ప్రభుత్వానికి అందించాలని ములుగు కలెక్టర్ దివాకర మిల్లర్లకు సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా రైస్ మిల్లర్లతో కలెక్టర్ అడిషనల్కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిల్లర్లకు మిల్లింగ్ చార్జీలు పెంచడం, సీఎంఆర్ కేటాయింపునకు మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సమర్పించడం వంటివి ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త నియమాలని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం కేటాయించిన 10రోజుల్లో బ్యాంకు గ్యారంటీ సమర్పించేందుకు అండర్ టేకింగ్ ఇవ్వాలని ఆదేశించారు. రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ సీఎంఆర్ సకాలంలో చెల్లించేందుకు మిల్లర్లకు అవసరమైన వసతులు కల్పించాలని, బ్యాంకు గ్యారంటీ అండర్ టేకింగ్ సమయాన్ని 15రోజులకు పెంచాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఫైజుల్ హుస్సేనీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి, రైస్ మిల్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
కాలేజీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాలలో క్లాస్ రూమ్స్, లెక్చర్ హాల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ రూమ్, లైబ్రరీ, ల్యాబ్, హాస్టల్, మెస్, టాయిలెట్స్ ల్లో జరుగుతున్న పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నర్సింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్‌కు కావల్సిన 2రూములు, చేయాలన్నారు. కళాశాల ఏ, బీ, సీ బ్లాకుల్లో అన్ని పనులు పది రోజుల్లో పూర్తిచేసి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ లాల్, డీఈ రాజశేఖర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధా రాణి తదితరులు పాల్గొన్నారు.