వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఖ్యాతిని చాటి చెబుదామని, హెరిటేజ్ సైట్ పరిరక్షణకు స్వచ్ఛందంగా సేవ చేద్దామని ములుగు కలెక్టర్ దివాకర్ సూచించారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ రామప్పలో మూడో వరల్డ్ హెరిటేజ్ వలంటీర్స్ క్యాంపెయిన్, యువ టూరిజం క్లబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను మంగళవారం కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ నిర్వహిస్తుందని, తెలంగాణ టూరిజం క్లబ్స్ లోని వివిధ కాలేజీల నుంచి 40 మంది విద్యార్థులు, వివిధ రాష్ట్రాల నుంచి40 మంది వలంటీర్లు పాల్గొంటున్నట్టు తెలిపారు.
వర్కింగ్ ఆన్ ది ఫ్యూచర్’ థీమ్‌తో 12 రోజులు వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కాకతీయుల చరిత్ర, సంస్కృతి,సంప్రదాయాలు, పర్యాటకం, నిర్మాణాల వంటి అంశాలపై లెక్చర్స్, ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయని, రాష్ట్ర పర్యాటక శాఖ సహకారంతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దేశంలోని పలు వర్సిటీల ప్రొఫెసర్ల ద్వారా వివిధ సబ్జెక్టులపై క్లాసులు ఉంటాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ మెంబర్ శ్రీధర్ రావు , జిల్లా టూరిజం ఆఫీసర్ శివాజీ, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్య కిరణ్, ప్రొఫెసర్ పాండురంగారావు, ఎంపీడీవో రాజు, ములుగు డిగ్రీ కాలేజ్ హిస్టరీ లెక్చరర్ లత, యోగ టీచర్ యోగి రాంబాబు, కేంద్రపురావస్తు శాఖ, దేవాదాయ శాఖ , పర్యాటక అభివృద్ధి సంస్థ సిబ్బంది, వలంటీర్లు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.