మేడారం ఆలయ పరిధిలో అభివృద్ధికి చర్యలు : కలెక్టర్ దివాకర

తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆలయ పరిధిలో అభివృద్ధి పనులను ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని ములుగు కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. గురువారం ములుగు జిల్లా  తాడ్వాయి మండలం మేడారంలోని ఐటీడీఏ గెస్ట్ హౌస్ లో మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి, పారిశుద్ధ్యం నిర్వాహణపై అడిషనల్​కలెక్టర్లు శ్రీజ, మహేందర్ జీతో కలిసి సమీక్ష నిర్వహించారు. మేడారంలో చేపట్టవలసిన అభివృద్ధి, పనుల స్థితిగతులపై ఆరా తీశారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.

అనంతరం కలెక్టర్, అధికారులు సమ్మక్క సారలమ్మ దేవాలయ ప్రాంగణం, క్యూలైన్లు, ఆలయం చుట్టూ ఉన్న వాచ్ టవర్స్ ను, ఆలయ పరిసరాలను, అధికారులతో కలిసి పరిశీలించారు. చిలకలగుట్ట, జంపన్న వాగు, ఆదివాసి మ్యూజియం, రెడ్డిగూడెం పరిసరాలను సందర్శించారు. ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆదివాసి వస్తువులను తిలకించారు. అదేవిధంగా శృతి వనం కోసం రెడ్డిగూడెం వద్ద భూమిని కలెక్టర్ పరిశీలించారు. వారివెంట ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, మేడారం ఆలయ ఈవో రాజేందర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

స్కిల్​టెస్ట్​ను పరిశీలించిన కలెక్టర్​ 

ములుగు (గోవిందరావుపేట), వెలుగు: మెడికల్​ కాలేజీలో డాటా ఎంట్రీ ఆపరేటర్​ కోసం గురువారం అభ్యర్థులకు నిర్వహించిన స్కిల్ టెస్ట్ ను కలెక్టర్​ దివాకర పర్యవేక్షించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా పాఠశాలలో నిర్వహించిన ఈ టెస్ట్​కు మొదటి రోజు 20మంది అభ్యర్థులు హాజరయ్యారు.