ఇంటర్ ప్రిటేషన్​ సెంటర్ పనులు వేగంగా చేపట్టాలి : కలెక్టర్ దివాకర

వెంకటాపూర్​(రామప్ప), వెలుగు: ప్రసాద్ స్కీంలో భాగంగా మంజూరైన ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత టూరిజం శాఖ ఇంజినీరింగ్ అధికారులను ములగు కలెక్టర్ దివాకర ఆదేశించారు. బండ్ అభివృద్ధి పనులను సైతం వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. గురువారం వెంకటపూర్ మండలం పాలంపేటలో ప్రసాద్ స్కీం ద్వారా మంజూరైన ఇంటర్ ప్రిటేషన్ సెంటర్ నిర్మాణం, రామప్ప దేవాలయ తూర్పు రోడ్డు, మెయిన్ కెనాల్, రిజర్వాయర్, బండ్ లను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. రామప్ప దేవాలయం తూర్పు ద్వారం ఎదురుగా 10ఎకరాల విస్తీర్ణంలో రూ.61.99 కోట్లతో  చేపట్టిన ఆయా నిర్మాణాల పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ రామప్ప సరస్సును సందర్శించి నీటి నిల్వ సామర్థ్యం, ఆయకట్టు, తదితర అంశాలపై ఆరా తీశారు. బండ్ వైండింగ్, సుందరీకరణ పనులను ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీపతి, ఇరిగేషన్​ శాఖ డీఈ రవీందర్ రెడ్డి, టూరిజం డీఈ  రామకృష్ణ, ఏఈ విజయ్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో రాజు, ఎంపీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

టూరిజం హబ్ కు ప్రణాళికలు సిద్ధం చేయండి 

ములుగు: జిల్లాను టూరిజం హబ్ గా ఏర్పాటు చేయడానికి ప్రణాళికాలు సిద్ధం చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్​లో టూరిజం మేనేజ్​మెంట్​ కమిటీతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గట్టమ్మ, రామప్ప దేవాలయం, లక్నవరం, తాడ్వాయిలోని బ్లాక్ బెర్రీ ఇలాండ్, బొగత, మల్లూరు దేవాలయం, కిన్నెరసాని స్టాటింగ్ పాయింట్ అయిన లవ్వాల, ట్రెక్కింగ్, జిల్లాలో ఉన్న ఇతర టూరిజం స్థలాలను గుర్తించి రూట్ మ్యాప్ తయారు చేయాలని తెలిపారు. సమావేశంలో డీఎఫ్​వో రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్ కుమార్, జిల్లా టూరిజం అధికారి శివాజీ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.