ములుగు/ఏటూరునాగారం, వెలుగు : తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని ములుగు కలెక్టర్ఇలా త్రిపాఠి సూచించారు. మంగళవారం జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి ఆఫీసర్లకు సూచనలు చేశారు. భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని చెప్పారు.
ముఖ్యంగా ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండొద్దని, అధికారుల దృష్టికి తీసుకువస్తే పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంతో పాటు జంపన్నవాగు, గుండ్లవాగు, లక్నవరం, రామప్ప సరస్సుల పరిధిలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. అకాలవర్షంతో వడ్లు తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు రెడీ
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రెడీగా ఉందాని ములుగు ఎస్పీ గౌస్ ఆలం చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే 100కు డయల్ చేయాలని సూచించారు. విద్యుత్ వైర్లు, కరెంట్ స్తంభాలు, చెట్ల కింద ఉండొద్దని సూచించారు. ములుగు, ఏటూరునాగారం సబ్ డివిజన్లలో విపత్తు రక్షణ బృందాలను అందుబాటులో ఉంచామన్నారు.
చెట్లు విరిగి రోడ్లపై పడితే వెంటనే తొలగించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జంపన్నవాగు, గుండ్లవాగు, ప్రధాన చెరువులు, గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు అలర్ట్‌గా ఉండాలని, ఆఫీసర్లకు సహకరించాలని సూచించారు. భారీ వర్షపాతంతో వరదలు వస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.