ఎన్నికల నియమావళి పక్కాగా పాటించాలి : ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు : ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పక్కాగా పాటించాలని ములుగు కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లొద్దని చెప్పారు. శనివారం కలెక్టరేట్​ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటరు చేతిలో సీ విజిల్​ బ్రహ్మాస్త్రం లాంటిదని, ఇప్పటివరకు అందిన ఏడు ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. 1950 టోల్​ ఫ్రీ నంబర్​కు అందిన 68 కాల్స్​ తో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పారు. అక్రమంగా నగదు, మద్యం పంపిణీని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 9 చెక్​ పోస్టులు ఏర్పాటు చేసి 24గంటలపాటు నిఘా ఉంచామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.5.26లక్షలు సీజ్​ చేసినట్లు చెప్పారు. 

ఏనుమాముల స్ట్రాంగ్​ రూమ్​ను పరిశీలించిన కలెక్టర్

వరంగల్​/ నర్సంపేట, వెలుగు  : వరంగల్​ ఏనుమాముల మార్కెట్​లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్​ రూమ్​ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్​ ప్రావీణ్య శనివారం పరిశీలించారు. గోడౌన్​లలో భద్రపర్చిన ఈవీఎంలు, వీవీప్యాట్​లను తనిఖీ చేశారు. నర్సంపేట, వర్ధన్నపేట, వరంగల్​ ఈస్ట్​ నియోజకవర్గాల పోలింగ్​ బూత్​లను పరిశీలించి సలహాలు, సూచనలు చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్​లను మూడు నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ ఆఫీసర్లకు అప్పగించారు. పోలింగ్​ సమయంలో ఈవీఎం, వీవీ ప్యాట్​లలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్​ పార్టీ ప్రతినిధి తక్కళ్లపల్లి రవీందర్​రావు కలెక్టర్​ను కోరారు.