- కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క
- మిడతల దండుగా వస్తున్న వారికి బుద్ధి చెప్పాలని పిలుపు
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. తాను నిత్యం ప్రజలతోనే ఉన్నానని, ఎన్నికలు రాగానే మిడతల దండుగా వస్తున్న వారికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మంగళవారం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని చాతరాజుపల్లి, తిమ్మాపూర్, వెళ్తుర్లపల్లి గ్రామాలలో ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని, అయినా ప్రజలు తన వైపు ఉన్నారని చెప్పారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలను లేవనెత్తినందుకే సీఎం కేసీఆర్ తనను ఓడించేందుకు కుట్రచేస్తున్నారని విమర్శించారు. తాను ఎవరినీ బెదిరించలేదని, ఎన్ని కుట్రలు చేసినా ములుగు నియోజకవర్గంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.