రాజకీయ బలబలాలను చూపించుకోవడానికే టీఆర్ఎస్, బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గతంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేసుకుని ఓటర్లు ఆయన కూతురు పాల్వాయి స్రవంతిని గెలిపించాలన్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన వస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడున్న ధరలను ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. ములుగు, మునుగోడు నియోజకవర్గాల్లో తనపై ప్రజలు చూపుతున్న అభిమానంలో ఎలాంటి తేడా లేదన్నారు.
మునుగోడు ఉద్యమాల, పోరాటల గడ్డ అని, చైతన్యవంతమైన ప్రజలు ఇక్కడ ఉన్నారని సీతక్క అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకు టీఆర్ఎస్, బీజేపీ డబ్బు సంచులను నమ్ముకున్నాయని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే డబ్బుల సంచులు పట్టుకొని వస్తున్నారని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి మాత్రం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.