
మంగపేట, వెలుగు: ములుగు జిల్లాలోని మంగపేట మండలంలో సోమవారం కురిసిన వర్షానికి నష్టపోయిన పంటలను అధికారులు పరిశీలించారు. కలెక్టర్ దివాకర, అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ మండల పరిధిలోని నరసింహ సాగర్ గ్రామ రైతులను కలుసుకొని పంటలను పరిశీలించారు. అధైర్య పడొద్దని ప్రభుత్వం నుంచి తప్పకుండా సాయం అందుతుందని చెప్పారు. స్థానిక అధికారులు పంట నష్టం వివరాలను సేకరిస్తున్నారని, వివరాలు వీలైనంత త్వరగా అధికారులకు అందించాలని కోరారు.
అనంతరం మల్లూరు హేమాచల క్షేత్రంలో మేలో జరగనున్న లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ మండలంలోని నరసింహాసాగర్, గాంధీనగర్ శనిగకుంట, చుంచుపల్లి, తిమ్మంపేట, కొత్తమల్లూరు గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. కలెక్టర్ల వెంట స్థానిక అధికారులు ఉన్నారు.