
- ఇంటర్ ఫలితాల్లో ములుగు జిల్లా టాప్
- అధిక మార్కులు సాధించిన వారిలో అమ్మాయిలే ఎక్కువ
- ప్రతిభ కనబర్చిన గురుకుల విద్యార్థులు
వెలుగు, నెట్ వర్క్ : మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలు మెరుగైన ఫలితాలు సాధించాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆ జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. సెకండ్ ఇయర్లో 85శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించామన్నారు. మొదటి సంవత్సరంలో 72శాతం విద్యార్థులు పాసై నాల్గో స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. మంగపేట ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్టూడెంట్ బండారి మరియ బైపీసీ గ్రూప్ లో 982 సాధించగా, ఎంపీసీలో ములుగు మండలం బండారుపల్లి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ విద్యార్థి కొమ్ము టాగూర్ 981మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచారు.
జనగామ అర్బన్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో జనగామ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 3362 మంది స్టూడెంట్లకు 2289 మంది , ఫస్ట్ ఇయర్లో 3241 మంది స్టూడెంట్ల కు 1881 మంది స్టూడెంట్స్ పాసైనట్టు డీఐఈవో శ్రీనివాస్ తెలిపారు.
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఆశించిన ఫలితాలు రాలేదు. జిల్లా ఇంటర్మిడియట్ ఆఫీసర్ సత్యనారాయణ మంగళవారం వివరాలు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 53 శాతంతో రాష్ట్రంలో 22 వ స్థానంలో నిలిచిందని, సెకండ్ ఇయర్ 64 శాతంతో రాష్ట్రంలో 18వ స్థానం దక్కిందని తెలిపారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ స్టూడెంట్ అక్షయ దుర్గా ఎంపీసీలో 984 మార్కులు సాధించగా, అనంతారం మోడల్ స్కూల్లో మోనా ట్వింకిల్ విద్యార్థిని సెకండ్ ఇయర్ బైపీసీలో 979 మార్కులు సాధించింది.
భూపాలపల్లి అర్భన్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్టూడెంట్లు ఆశాజనక ఫలితాలను సాధించారు. ఫస్ట్ ఇయర్లో జిల్లా వ్యాప్తంగా 45% మంది, సెకండ్ ఇయర్ లో 64% మంది పాసయ్యారు.
వరంగల్ జిల్లా.. 58 శాతం ఉత్తీర్ణత
ప్థమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో వరంగల్ జిల్లా 50శాతం, 58 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి కాకా మాధవరావు పేర్కొన్నారు. ఒకేషనల్ ఫస్ట్ ఇయర్లో 56 శాతం, సెకెండ్ ఇయర్లో 64 శాతం సాధించినట్టు ఆయన పేర్కొన్నారు.
కాజీపేట : ఇంటర్ ఫలితాలలో కాజీపేట మండలం మడికొండలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్టు ప్రిన్సిపల్ డి. ఉమామహేశ్వరి తెలిపారు. సెకండియర్ ఎంపీసీలో ఎన్. శ్రీనిధి 987 మార్కులు, ఎమ్. రక్షిత 984 మార్కులు , బైపీసీలో బి. జమున 976 మార్కులు సాధించినట్లు తెలిపారు.
ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకు ఎండీ. షాహిని, ఎం. రక్షిత 465 మార్కులు, భవాని ప్రసన్న, ఎం. విన్నీ విద్యార్థిణులు 461 మార్కులు సాధించారన్నారు. బైపీసీలో ఎస్. పూజిత 436 మార్కులు, జి. రవళి 433 మార్కులు సాధించినట్లు తెలిపారు.
అమ్మాయిలే టాప్..
హనుమకొండ/ కమలాపూర్ : హనుమకొండ జిల్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 73 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలవగా.. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 68 శాతం పాస్ పర్సంటేజీతో 6వ స్థానం సాధించింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో అమ్మాయిలే ఎక్కువ శాతం పాస్ అయ్యారు. కమలాపూర్‌లోని కస్తూర్భా గాంధీ బాలికల జూనియర్ కాలేజీలో స్టూడెంట్ సిరి సహస్ర్త 988 మార్కులు సాధించి కేజీబీవీ స్కూళ్లలో స్టేట్ టాపర్‌గా నిలిచింది.