
హైదరాబాద్, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన గొల్లపెల్లి విష్ణు (40) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల అతడికి ఒక్కసారిగా బీపీ పెరగడంతో ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, వారు హైదరాబాద్ రెఫర్ చేశారు. తర్వాత నాగోల్‌లోని ఓ ఆస్పత్రికి విష్ణును తరలించగా, అక్కడ పరీక్షించిన డాక్టర్లు.. బీపీ పెరగడం వల్ల మెదడులో నరాలు చిట్లిపోయాయని చెప్పారు.
అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.15 లక్షల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఒక ఆపరేషన్ పూర్తయిందని, ఇందులో పేషెంట్ పుర్రెను తొలగించారని కుటుంబసభ్యులు వెల్లడించారు. దీనికి రూ.5 లక్షలు ఖర్చు అయిందన్నారు. అర్జెంట్‌గా ఇంకో ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.10 లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారన్నారు. కూలి పనులు చేసుకొని బతికే తమ వద్ద అంత డబ్బు లేదని, దాతలు ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, అకౌంట్ నంబర్: 73094158726, ఐఎఫ్‌సీ కోడ్ ఏపీజీవీ0005140 లేదా ఫోన్ పే, గూగుల్ పే నంబర్ 81068 93484కు డబ్బులు పంపాలని కోరారు. బాధితుడికి భార్య, పాప, బాబు ఉన్నారు.