ఉద్యాన రైతులకు అండగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​

 ఉద్యాన రైతులకు అండగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్​
  • మేలైన వంగడాల రూపకల్పన
  • ప్రత్యామ్నాయ వ్యవసాయానికి సహకారం
  • అందుబాటులో పలు రకాల మొక్కలు

సిద్దిపేట/ములుగు, వెలుగు: ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు సిద్దిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ తరపున ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్​ఎక్సలెన్స్ (ఫ్రూట్స్) నాణ్యమైన మొక్కలను అందజేస్తోంది. మార్కెట్​లో డిమాండ్ ఉన్న పండ్లు, కూరగాయల మొక్కలను రైతులకు అందిస్తూ వారు లాభాలు అర్జించే దిశగా ప్రోత్సహిస్తోంది. మొత్తం 53 ఎకరాలున్న సెంటర్ ఆఫ్‌‌ ‌‌ఎక్సలెన్స్ లో టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ తో పాటు నర్సరీ నిర్వహిస్తున్నారు.

 32 ఎకరాల్లో సాయన్ బ్లాక్ (తల్లి మొక్కలు), 8 ఎకరాల్లో నర్సరీ (పండ్ల మొక్కలు), 2 ఎకరాల్లో ఫ్లాగ్ టైప్ నర్సరీ (కూరగాయల నారు), 2 ఎకరాల్లో  పందిరిరకం కూరగాయలు, ఒక ఎకరంలో శ్రీగంధం మొక్కలు, చింత చెట్లను పెంచుతున్నారు. వీటితో పాటు వెదురు, సరుగుడు,  పూల మొక్కలు, మల్లె, బొగన్ విల్లా మొక్కలను పెంచుతున్నారు. ఏటా నాలుగు  లక్షల మొక్కలను రైతులకు పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం సెంటర్​లో రైతుల కోసం జామ, నిమ్మ, మామిడి మొక్కలను సిద్ధం చేసి పెట్టారు.

భారీగా కూరగాయల మొక్కలు

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో దాదాపు 30 లక్షల కూరగాయల నారు మొక్కలను రైతుల కోసం సిద్ధం చేస్తున్నారు. టమాట, మిరప, కాలిఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయల నారు మొక్కలను నర్సరీలో పెంచుతున్నారు. వీటిని సిద్దిపేట, మెదక్, వరంగల్, మహబూబాద్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జనగామ, జగిత్యాల రైతులకు అందిస్తున్నారు. కూరగాయల నారు మొక్కలు కావాల్సిన రైతులు ఆయా జిల్లాల ఉద్యానవన అధికారుల నుంచి అనుమతి పత్రాలు తెస్తే ఉచితంగా అందజేస్తారు. ప్రస్తుతం మిరప, టమాట, క్యాబేజీ  మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.3.

మామిడి తోటలకు సహకారం

గ్రామీణ ప్రాంతాల్లో మామిడి తోటల పెంపకానికి సీవోఈ పూర్తి సహకారం అందిస్తోంది. రైతుల డిమాండ్​ను బట్టి 19 రకాల మామిడి మొక్కలను పెంచుతున్నారు. అధికంగా డిమాండ్ ఉండే దసిరి, మహత్,  బేనిషా, కేసరీ, రాయల్, రత్న వంటి రకాలను అంటుకట్టే విధానంలో పెంచి రైతులకు అందజేస్తారు. మూడేళ్లలో మామిడి ఉత్పత్తి జరిగే మేలు రకాల మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల రైతులకు మేలు రకం మామిడి మొక్కలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 

వెదురు సాగుపై ప్రత్యేక దృష్టి

వెదురు సాగుపై సెంటర్ ఆఫ్‌‌ ‌‌ఎక్సలెన్స్ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఆగ్రో ఫారెస్ట్  స్కీంలో బాంబో మిషన్ కింద  వెదురు సాగుకు ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా మొక్కలను ఇస్తుంది. చిన్న చిన్న కమతాలుండి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునే వారికి బ్లాక్ ప్లాంటేషన్ కింద వెదురు తోటలు సాగు చేసుకునేందుకు సబ్సిడీపై మొక్కలతో పాటు అవగాహన కల్పిస్తోంది. ఆగ్రో ఫారెస్ట్రీ లో భాగంగా శ్రీగంధం మొక్కలను అందిస్తూ సంరక్షించుకునే విధానాన్ని వివరిస్తూ సపోర్టింగ్ మొక్కలను అందిస్తోంది. గతేడాది 50 వేల శ్రీగంధం, వెదురు మొక్కలను పంపిణీ చేయగా ప్రస్తుత ఏడాదిలో ఇప్పటివరకు 25 వేల మొక్కలను పంపిణీ చేసింది.

నాణ్యమైన మొక్కల పంపిణీ

సెంటర్ ఆఫ్‌‌ ‌‌ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో రైతులకు నాణ్యమైన మొక్కలను పంపిణీ చేస్తున్నాం. కూరగాయల నారును రైతులకు ఉచితంగా అందిస్తు వారికి అవగాహన కల్పిస్తున్నాం. పండ్లు, పూలతో పాటు ఆగ్రో ఫారెస్ట్రీలో భాగంగా శ్రీగంధం, వెదురు మొక్కలను అందుబాటులో ఉంచాం. బాంబో మిషన్ స్కీంలో వెదురు సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

శ్రీధర్, ఎడీహెచ్, సీవోఈ, ములుగు