ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది: ఎమ్మెల్యే సీతక్క

ములుగు జిల్లా: ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల స్కీంల పేరుతో స్కాములు చేస్తూ పేదల పొట్టకొట్టి రోడ్డున పడేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కలెక్టరేట్ లో రైతు పోరు ధర్నాలో ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే సీతక్క ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధర్నాలో మాట్లాడిన సీతక్క రైతులకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.  పోడు భూములకు పట్టాలివ్వటంతో పాటు... రైతు రుణమాఫీ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం పేదల సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు.