ఏటూరునాగారం, వెలుగు : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేశాను తప్పితే రాజకీయం చేయలేదని ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో సోమవారం నిర్వహించిన యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. దళితబంధు, గృహలక్ష్మి లబ్ధిదారుల ఎంపికలో అర్హులకు అన్యాయం జరిగిందన్నారు.
ఇల్లు ఇవ్వని బీఆర్‌ఎస్ లీడర్లను ఇండ్లలోకే రానివ్వొద్దని సూచించారు. కరోనా టైంలో, వరదల టైంలో తాను ప్రజలకు అండగా ఉండానని గుర్తు చేశారు. కష్టం కాలంలో ఆదుకోని లీడర్లు ఇప్పుడు ఓట్ల కోసం డబ్బు సంచులతో వస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ప్రజలు ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకే అందజేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మల్లాడి రాంరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్, నాయకులు బానోత్ రవిచందర్, ఇర్సవడ్ల వెంకన్న, చిటమట రఘు, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ. అయూబ్‌ఖాన్ పాల్గొన్నారు.