డాక్టర్​ కావాలా? యాక్టర్ ​కావాలా? : ములుగు ఎమ్మెల్యే సీతక్క

  • డాక్టర్​ కావాలా? యాక్టర్ ​కావాలా?
  • ప్రజలారా... మీరే తేల్చుకోండి
  • మానకొండూరులో ములుగు ఎమ్మెల్యే సీతక్క

గన్నేరువరం, వెలుగు : కరీంనగర్​ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ ప్రజలు...డాక్టర్ కావాలో..యాక్టర్ కావాలో తేల్చుకోవాలని, యాక్టర్ నటించి కొన్ని నిమిషాలు మాత్రమే సంతోషపెడతారని, అదే డాక్టర్ అయితే ప్రాణాలు కాపాడుతారని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో బుధవారం డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు సీతక్కతో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అసెంబ్లీలో పాటలు పాడుతూ ఆహా ఓహో అంటే అభివృద్ధి కాదని, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కరించాలన్నారు.

మండల కేంద్రానికి డబుల్ రోడ్డు కావాలని ధర్నా చేసిన వారిపై కేసులు పెట్టడం దారుణమన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గత ఎన్నికల టైంలో గన్నేరువరం నుంచి కరీంనగర్ కు బ్రిడ్జి వేయిస్తానని ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్​ హామీ ఇచ్చారని ఇప్పటివరకు అది  నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చొక్కారావుపల్లె నుంచి కాజీపూర్ వరకు బ్రిడ్జి వేస్తామన్నారు. ఈ సందర్భంగా గన్నేరువరం మండల యువజన నాయకుడు అల్లూరి శ్రీనాథ్ రెడ్డితో పాటు మరో 300 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు ముసుకు ఉపేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి, కొమ్మెర రవీందర్ రెడ్డి, శివసేన రెడ్డి, దేశారాజ్ అనిల్ , మాతంగి అనిల్ పాల్గొన్నారు.