
- రూట్ మ్యాప్ విడుదల చేసిన ములుగు ఎస్పీ
-
ట్రాఫిక్ నియంత్రణ కోసం వన్ వే రూల్స్‌నేటి నుంచే అమలు
మేడారం (జయశంకర్ భూపాలపల్లి), వెలుగు: మేడారం మహాజాతరకు ప్రైవేట్ వాహనాల్లో వచ్చేవారి కోసం పోలీస్ శాఖ రూట్లను ప్రకటించింది. మంగళవారం నుంచి వన్ వే అమలు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ డాక్టర్ శబరీశ్ వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ట్రాఫిక్ రూల్స్ అమల్లో ఉంటాయన్నారు. ఈ మేరకు ‘మేడారం జాతర’ పేరుతో మొబైల్ యాప్ విడుదల చేశారు. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి జరిగే మహాజాతరకు సుమారు నాలుగు లక్షలకు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే 1400 ఎకరాల్లో 33 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు.
వచ్చేందుకు నాలుగు రూట్లు..
- హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హన్మకొండ మీదుగా వచ్చే వెహికిల్స్.. గుడెప్పాడ్ మీదుగా ములుగు దాటేసి పస్రా దగ్గర క్రాస్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వెహికిల్స్
- నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి..ములుగు, పసర, నార్లాపూర్, మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ భక్తుల కోసం ఊరట్టం క్రాస్ నుంచి మొదలుకొని ప్రాజెక్ట్ నగర్ వరకు పార్కింగ్ ప్లేస్‌లు కేటాయించారు.
- జాతర ముగించుకొని తిరుగు ప్రయాణంలో వీళ్లు నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల, గుడెప్పాడ్ క్రాస్ దగ్గర రైట్ తీసుకొని హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హన్మకొండ వాళ్లు వెళ్లిపోవాలి. ఖమ్మం, మహబూబాబాద్ వాళ్లు గుడెప్పాడ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని మల్లంపల్లికి వచ్చి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి.
- గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వెహికిల్స్.. కాటారం నుంచి క్రాస్ చేసుకొని చింతకాని, యామన్ పల్లి, పెగడపల్లి, సింగారం, కాల్వపల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. వీరికి ఊరట్టం దగ్గరే పార్కింగ్ ప్లేస్‌లు కేటాయించారు. ఈ వెహికిల్స్ అన్నీ కూడా తిరుగు ప్రయాణంలో ఇదే రూట్‌లో వెళ్లిపోవడానికి అనుమతించారు. అవసరమైతే నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా కూడా వెళ్లొచ్చు.
- చత్తీస్‌గఢ్, భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి దగ్గర క్రాస్ చేసుకొని కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి. వీళ్లకోసం ఊరట్టం దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్‌లు కేటాయించారు. ఈ వాహనాలు అన్నీ తిరుగు ప్రయాణంలో వచ్చినదారిలోనే వెళ్లిపోవాలి.
- ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వెహికిల్స్ అన్నీ కూడా తాడ్వాయి దగ్గర క్రాస్ తీసుకొని మేడారం చేరుకోవాలి. తిరిగి ఇదే రూట్‌లో ఈ వాహనాలను పంపిస్తారు.
పార్కింగ్ ప్లేసుల్లో సకల సౌకర్యాలు
మేడారం భక్తుల కోసం పోలీసులు 33 పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేశారు. వీటికోసం నెల రోజుల నుంచి శ్రమించారు. మేడారం చుట్టూరా 20 కిలోమీటర్ల పరిధిలో 1400 ఎకరాలను పార్కింగ్ కోసం కేటా యించారు. పస్రా‒మేడారం రూట్‌లో జంపన్నవాగు దగ్గర నుంచి ప్రైవేట్ వెహికిల్స్ పార్క్ చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులను తాడ్వాయి‒మేడారం రూట్‌లో బస్టాండ్ ప్లేస్‌లో పార్క్ చేయాలి. వీఐపీ, వీవీఐపీలకు గద్దెలకు దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్‌లను కేటాయించారు. పార్కింగ్ స్థలంలోనే టాయిలెట్స్, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి కల్పించారు.