వెంకటాపురం, వెలుగు: మావోయిస్టు కదలికలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు ములుగు ఎస్పీ శబరీశ్ సూచించారు. శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రిసెప్షన్ లో రికార్డ్స్ పరిశీలించి కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ సిబ్బంది కిట్ ఆర్టికల్స్, వెపన్స్ సమాచారం, స్టేషన్ సిబ్బంది నైపుణ్యాన్ని పరిశీలించారు. ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. ఛత్తీస్ గఢ్ అడవుల గుండా మావోయిస్టులు మండలంలోకి ప్రవేశించే అవకాశం ఉందని... ప్రజల శాంతిభద్రతలు కాపాడే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు.
అంతర్ రాష్ట్ర సరిహద్దుల నుండి గంజాయి, గుడుంబా వంటి మారకద్రవ్యాలు రవాణాపై నిఘా ఏర్పాటు చేయాలని అన్నారు. రహదారిపై ఇసుక లారీలు నిలిపివేయడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది గురవుతున్నారన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా లారీలు నిలిపితే కేసులు పెడతామని హెచ్చరించారు. బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన తక్షణమే రసీదు అందజేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. అనంతరం సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఐ బండారి కుమార్, ఎస్సై తిరుపతి రావు, ప్రొబేషనరీ ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.