భవిష్యత్తులో విద్యా హబ్​గా ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ

భవిష్యత్తులో  విద్యా హబ్​గా  ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ

మన రాష్ట్రానికి  ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీని  మంజూరు  చేసి,  ఆ యూనివర్సిటీ పేరు వనదేవతలైన  సమ్మక్క- సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీగా  స్వయానా మోదీనే నామకరణం చేశారు.  హైదరాబాద్​కు  250 కిలోమీటర్ల దూరంలో,  వరంగల్లుకు 50 కిలోమీటర్ల  దూరంలో  అటు కరీంనగర్​కు  ఇటు ఖమ్మంకు,  ఉత్తర తెలంగాణలోని  అన్ని జిల్లాలకు దగ్గరగా ఉండేవిధంగా..  ములుగు జిల్లాలోని జాకారం దగ్గర  గట్టమ్మ దేవాలయానికి సమీపంలో యూనివర్సిటీకి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.  దీనికి అనుగుణంగా ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో  యూనివర్సిటీకి 211 ఎకరాలను కేటాయిస్తున్నట్లు  ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.  ప్రస్తుతం  తాత్కాలిక భవనంలో  యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో ఈ విద్యా సంవత్సరం నుంచి  బీఏ ఎకనామిక్స్ హానర్స్,  బీఏ  ఇంగ్లీష్  లిటరేచర్  రెండు డిగ్రీ కోర్సులను ప్రారంభించారు.  

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మూడు సెంట్రల్  యూనివర్సిటీలూ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నవి.  ఈ ట్రైబల్ యూనివర్సిటీ  గ్రామీణ జిల్లా‌ ములుగులో స్థాపించడం నిజంగా తెలంగాణ  విద్యార్థుల అదృష్టంగా భావించాలి.  దేశంలో  మిగతా రాష్ట్రాలతో  పోలిస్తే  గుజరాత్,  రాజస్థాన్​లో  సైతం రెండు సెంట్రల్  యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి.  కానీ, మన తెలంగాణలో నాలుగు సెంట్రల్ యూనివర్సిటీలు ఉండడం తెలంగాణ విద్యార్థులకు ఒక వరంగా భావించవచ్చు సాధారణంగా  మూడు  సంవత్సరాల డిగ్రీ కాకుండా  విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధిని  కల్పించేవిధంగా అంతర్జాతీయ  ప్రమాణాలకు  సమానంగా క్రెడిట్స్ సిస్టం  ప్రకారం  4 సంవత్సరాల  డిగ్రీ కోర్స్​తో  ఈ విద్యా సంవత్సరం నుంచి  తరగతులు ప్రారంభం అయ్యాయి.

నాలుగు సంవత్సరాల డిగ్రీతో  పీహెచ్​డీకి అర్హత

నూతన విద్యా విధానం- 2020 ప్రకారం నాలుగు సంవత్సరాల డిగ్రీని రూపొందించారు.  ఈ డిగ్రీ వలన విద్యార్థులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  తెలంగాణలో అన్ని డిగ్రీ కళాశాలలో మూడు సంవత్సరాల డిగ్రీ మాత్రమే ఉంది. కేవలం సెంట్రల్ యూనివర్సిటీలలో  మాత్రమే నాలుగు సంవత్సరాల డిగ్రీ అమలు అవుతున్నది.  ముఖ్యంగా  ఒక విద్యార్థి ఎనిమిది సెమిస్టర్లలో  వివిధ రకాలైన సబ్జెక్టులను చదవడం,  కంప్యూటర్స్, ఇంగ్లీష్  సబ్జెక్టులు అన్ని సెమిస్టర్​లో  ఉండడం ద్వారా విద్యార్థులకు వారి సబ్జెక్టులపైనే కాకుండా ఇంగ్లీష్ భాష పై పట్టు,  కంప్యూటర్ పరిజ్ఞానం సాధించే అవకాశం ఉంది.  అలాగే విద్యార్థి  నాలుగు సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేశాక విద్యార్థి ఆసక్తి మేరకు  నేరుగా పీహెచ్​డీ  చేయడానికి అర్హత సాధిస్తాడు.  అదేవిధంగా జాతీయ,  తెలంగాణ ఉపాధ్యాయ పరీక్షకు కూడా నేరుగా అర్హత సాధించే అవకాశం ఉంది.  ఈ నాలుగు సంవత్సరాలలో ఉన్నటువంటి క్రెడిట్స్ ఆధారంగా భవిష్యత్తులో వేరే దేశంలో కూడా మాస్టర్స్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం రెండు కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇంకా కోర్సుల సంఖ్య పెంచడం కోసం అధికారులు కావలసినటువంటి ప్రణాళికలను సిద్ధం  చేస్తున్నారు.  భవిష్యత్తులో  ప్రారంభించే కోర్సులు కూడా విద్యార్థులకు ఎక్కువగా ఉపాధిని కల్పించేవిధంగా ఉండబోతున్నాయి.  ఈ నాలుగు సంవత్సరాలలో కూడా బోధన మొత్తం‌ ఆంగ్లంలో ఉండటం, విద్యార్థి రాసే పరీక్ష విధానం కూడా ఆంగ్ల మాధ్యమంలో ఉండడం విద్యార్థులకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా మారనుంది.  ఆంగ్ల మాధ్యమంలో  కోర్సులను రూపొందించడం ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో ఇంగ్లీష్​ భాషపై  పట్టు పెరగడమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగాలు సులువుగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది.

అన్నివర్గాల విద్యార్థులకు అవకాశం

రాబోయే రోజుల్లో  ములుగు జిల్లాలోని  ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఒక విద్యా హబ్​గా  తయారుకాబోతుంది.  పేరులో ట్రైబల్ ఉన్నప్పటికీ యూనివర్సిటీలో అన్ని వర్గాల విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.  ఏ యూనివర్సిటీ అయినా ప్రారంభంలో  కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కోవడం సర్వసాధారణం.  ఒకప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలు రెండూ కూడా ఒక చిన్న భవనం నుంచి ప్రారంభమయ్యాయి.   నేడు లక్షల సంఖ్యల విద్యార్థులను తయారు చేయడమే కాకుండా మేధావులను, ఉద్యోగస్తులను, నాయకులను తయారుచేసే  కేంద్రాలుగా  మారాయి.  అనేక  నూతన పరిశోధనలకు కేంద్రబిందువుగా మారిపోయాయి.  భవిష్యత్తులో కూడా ఈ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ అదేవిధంగా తయారు కాబోతుంది.  ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 300 ఎకరాలలో  సువిశాలమైన క్యాంపస్ నిర్మాణం కాబోతుంది.  అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలు, అదనపు ఉద్యోగాలు స్థానికులకే వచ్చే అవకాశం ఉండడం ద్వారా ఇక్కడి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.  రాబోయే రోజుల్లో  ట్రైబల్​ యూనివర్సిటీ ఫలాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి.    వనదేవతలైన సమ్మక్క సారక్క ఆశీస్సులతో భవిష్య త్తుకు బంగారు బాటగా మారాలని ఆశిద్దాం.

-డా. చింత ఎల్లస్వామి,
 అసిస్టెంట్ ప్రొఫెసర్,
సమ్మక్క- సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ