ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇండియా బుచ్చి బాబు టోర్నమెంట్ ఆగస్టు 15 న ప్రారంభమైంది. అయితే టోర్నీ అసలు కళ రేపటి నుంచి మొదలు కానుంది. స్టార్ ప్లేయర్లు ఉన్న ముంబై జట్టు మంగళవారం (ఆగస్టు 27) తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్సీలో ముంబై జట్టు టిఎన్‌సిఏ ఎలెవన్ తో మ్యాచ్ ఆడనుంది. ముంబై తరపున సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గరికి ఈ టోర్నీ కీలకంగా మారనుంది.
సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో భారత్.. బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకోవాలంటే దేశవాళీ కీలకం కానుంది. బుచ్చి బాబు టోర్నీతో పాటు దులీప్ ట్రోఫీలో ఎవరు ఆడితే వారు భారత జట్టులోకి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీసీసీఐ అధికారుల్లో ఈ విషయాన్ని ద్రువీకరించినట్టు తెలుస్తుంది. సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్ లలో ఒక్కరికే టెస్ట్ స్క్వాడ్ లో స్థానం దక్కనుంది. దీంతో ఈ టోర్నీలో ఈ ముగ్గురు చెలరేగడం ఖాయంగా కనిపిస్తుంది.
ఈ ఏడాది ప్రారంభంలో ముంబైకి 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను అందించిన కెప్టెన్ అజింక్య రహానే ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఈ వెటరన్ ప్లేయర్ ప్రస్తుతం ఇంగ్లండ్ వన్డే కప్ లో లీసెస్టర్‌షైర్ తరఫున ఆడుతున్నాడు. షామ్స్ ములానీ,అంగ్క్రిష్ రఘువంశీ ఈ టోర్నీకి అందుబాటులో ఉండడం లేదు. ముంబయికి సర్ఫరాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సూర్య టెస్ట్ క్రికెట్ పై ఇటీవలే తన ఆసక్తిని వెల్లడించగా.. శ్రేయాస్, సర్ఫరాజ్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.