హఫీజ్ సయీద్ కి జైలు శిక్షతో టెర్రర్ ఫండింగ్ కు దెబ్బ

జమాత్ ఉద్​ దవా చీఫ్​ హఫీజ్​ సయీద్​కి పాక్​ కోర్టు 11 ఏళ్ల జైలు శిక్ష పడిందంటే టెర్రరిస్టులకు ఫైనాన్స్​ చేసే వ్యవస్థపై దెబ్బ పడినట్లే. అతను సాదాసీదా వ్యక్తి కాదు. 2001 నుంచి 2008 వరకు ఇండియాలో జరిగిన ప్రతి టెర్రర్​ ఎటాక్​ వెనుక అతని హస్తముంది. అమాయక యువకులకు ఇండియాపై ద్వేషం నూరిపోసి.. వాళ్లను మానవ బాంబులుగా తయారు చేశాడు. పక్కా ప్లానింగ్​తో ఎన్నో దాడులకు మాస్టర్​ మైండ్​ అతనిదే. ఇండియా ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోని పాకిస్థాన్​ ఇప్పుడు ఏం జవాబు చెబుతుందో చూడాలి.

హఫీజ్​ సయీద్​కి నరనరాల్లోనూ ఇండియాపై ద్వేషం. ముంబైలో జరిగిన ప్రతి దాడి వెనుక అతని హస్తం ఉన్నట్లుగా ఇప్పటికే ఎన్నోసార్లు ఇండియా ఐక్యరాజ్య సమితి దృష్టికి తెచ్చింది. 2001లో పార్లమెంట్​పై టెర్రరిస్టులు దాడి చేయడంతో మొదటిసారి అతని పేరు బయటకొచ్చింది. ఈ దాడికి హఫీజ్​కి చెందిన లష్కర్​ ఏ తోయిబాతోపాటు జైష్​ ఎ మహమ్మద్​ సంస్థలు కారణంగా గుర్తించారు. అయిదుగురు టెర్రరిస్టులు సహా 14 మంది చనిపోయారు. రెండోసారి 2006లో ముంబై సబర్బన్​ రైళ్లలో బాంబులు పేలినప్పుడుకూడా హఫీజ్​పైనే ఆరోపణలొచ్చాయి. కేవలం 11 నిమిషాల గ్యాప్​లో ఏడు సబర్బన్​ రైళ్లలో పేలుళ్లు జరిగాయి. ఈ దాడిలో 200 మందికి పైగా చనిపోగా, 714 మంది గాయపడ్డారు. ఈ అన్ని సందర్భాల్లోనూ ఇండియా పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్​ జరిపి, తగిన సాక్ష్యాధారాల్ని చూపించినా పాకిస్థాన్​ పట్టించుకోలేదు. కంటి తుడుపుగా హఫీజ్​ సయీద్​ని హౌస్​ అరెస్టు చేయడం, మళ్లీ వదిలిపెట్టడం చేస్తూ వచ్చింది.

2008లో ముంబైపై జరిపిన దాడి చాలా పెద్దది. పాకిస్థానీ యువకులకు ప్రత్యేకంగా ట్రైనింగ్​ ఇవ్వడమే కాకుండా, వాళ్లు ముంబైలో కాలుమోపడం దగ్గర్నుంచి ఎక్కడెక్కడ దాడులు చేయాలన్నదీ పక్కాగా గ్లోబల్​ పొజిషనింగ్​ సిస్టమ్​ (జీపీఎస్​)తో పంపించాడు. దీనికోసం ఇండియాలోనే ఆరుగురితో రెక్కీ టీమ్​ని, ఇద్దరితో సిమ్​కార్డులు సప్లయి చేసే టీమ్​ని కూడా రెడీ చేశాడు. లష్కర్​ సంస్థలోని సీనియర్​ మెంబర్లు జకీర్​ లఖ్వి, యూసుఫ్​ ముజామ్మిల్​, జరార్​ షా, అబు హమ్జా లాంటి వాళ్లను ఈ ఆపరేషన్​లో ఇన్​వాల్వ్​ చేశాడు. వీళ్లలో కొందరు దాడుల ప్లానింగ్​లో, కొందరు సూసైడ్​ టీమ్​ట్రైనింగ్​లో, మిగతావాళ్లు ఫైనాన్స్​ వ్యవహారాలు చూడడంలో ఆరితేరినవాళ్లు.

పాకిస్థాన్​ నుంచి మిలిటెంట్లు ఎప్పుడు బయలుదేరాలో టైమ్​ ఫిక్స్​ చేసే పనిని ఇండియన్​ టీమ్​కి అప్పగించాడు. రెక్కీ టీమ్​లోని ఆరుగురూ ముంబైలో దాడులకు అనువైన ప్రాంతాల్ని గుర్తించారు. వీళ్లే దాడి చేసి తప్పించుకోవడానికి ఎస్కేప్​ రూట్​నికూడా ప్లాన్​ చేశారంటారు. ఈ రెక్కీ టీమ్​లోని ఫహీం అనేవాడి దగ్గర హేండ్​ రైటింగ్​తో మార్కింగ్​ చేసిన ముంబై మ్యాప్​ దొరికింది. ఇక, పాక్​ నుంచి వచ్చిన మిలిటెంట్లకోసం ఫోన్లు, ఫేక్​ డాక్యుమెంట్లతో సిమ్​ కార్డులు రెండో టీమ్​ రెడీ చేసింది. ఈ ఎనిమిది మంది బీహార్​, గుర్​గావ్​ తదితర ప్రాంతాలకు చెందినవాళ్లు.

ఈ మొత్తం దాడికి మాస్టర్​ మైండ్​ హఫీజ్​ సయీదేనని ఇండియా గట్టి ఆధారాలతో యూఎన్​ సెక్యూరిటీ కౌన్సిల్​కి నివేదికనిచ్చింది. కానీ, ఏమాత్రం పాకిస్థాన్​ లొంగలేదు. ఆరోపణలొచ్చిన ప్రతిసారీ హఫీజ్​ని హౌస్​ అరెస్ట్​ చేయడం, కోర్టు జోక్యంతో విడిచిపెట్టడం పరిపాటిగా మార్చేసింది. పాక్​ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అక్కడి జర్నలిస్టు తాహ సిద్దిఖీ తన ట్విటర్​లో ‘అరెస్ట్​. ఫ్రీ. రిపీట్​’ అన్నాడంటే అర్థం చేసుకోవచ్చు.

ఇన్నేళ్ల తరువాత పాకిస్థాన్​ కోర్టు హఫీజ్​ సయీద్​కి 11 ఏళ్ల జైలు శిక్ష వేసింది. టెర్రర్ ఫైనాన్సింగ్​కు సంబంధించిన రెండు కేసుల్లో ఈ శిక్ష పడింది. పాకిస్థాన్ కోర్టు ఇచ్చిన  తీర్పును చాలా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. ఈ శిక్ష వేయడం వెనకాలకూడా ఒక వ్యూహం ఉందని అంటున్నారు.

బ్లాక్​ లిస్టు తప్పించుకోవడానికేనా…

ఇప్పటికే పాకిస్థాన్​కి బయట ఎక్కడా తలెత్తుకునే పరిస్థితులు లేవు. ఇంతకాలం అండగా నిలబడ్డ అమెరికా కూడా పట్టించుకోవడం మానేసింది. మరోపక్క సౌదీ అరేబియా మద్దతు అంతంతమాత్రంగానే ఉంది. టెర్రరిస్టులకు పాకిస్థాన్​ సపోర్టు, షెల్టర్​ ఇస్తుందన్నది ఆ దేశంపైగల పెద్ద ఆరోపణ. ఈ నేపథ్యంలో పారిస్​లో ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది. ఈ నెల 16 నుంచి 21 వరకు ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్​ఏటీఎఫ్​)’ సమావేశమై… ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టు సంస్థలకు అందుతున్న నిధులపై చర్చించబోతోంది. ఈ ప్లీనరీలోనే పాకిస్థాన్​ని ‘బ్లాక్ లిస్టు’లో పెట్టేందుకు ఎఫ్ఏటీఎఫ్​ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ  సంస్థ ఏ దేశాన్నయినా ‘బ్లాక్ లిస్టు’లో పెట్టడమంటే చిన్న విషయం కాదు. ఓసారి ‘బ్లాక్ లిస్టు’కి ఎక్కితే ఆ దేశానికి కష్టకాలం మొదలైనట్లే. వివిధ దేశాలకు ఆర్థిక సహాయాన్నందించే ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​ (ఐఎంఎఫ్​), వరల్డ్ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), యూరోపియన్ యూనియన్ (ఈయూ) లాంటివి ఒక్క డాలర్​ విదిలించవు.  బ్లాక్ లిస్టులో చేరిన దేశాన్ని ఈ ఆర్థిక సంస్థలేవీ దగ్గరకు రానివ్వవు.  ఆయా సంస్థల నుంచి డెవలప్​మెంట్​ ప్రాజెక్టులకు అందాల్సిన పెట్టుబడులు రావు. ఎక్కడి నిధులు అక్కడే బ్లాక్​ అయిపోతాయి. ఆర్థిక సాయానికి సంబంధించి ఆ దేశానికి అన్ని దారులు మూసుకుపోయినట్లే అనుకోవాల్సి ఉంటుంది.

పాకిస్థాన్​కి కోలుకోలేని దెబ్బే

మిలిటెంట్ గ్రూపులకు నిధులను వరదలా పారించినందుకు పాకిస్థాన్​ని ‘బ్లాక్ లిస్టు’లో పెట్టడానికి దాదాపుగా రంగం సిద్దమైందంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. చేసిన అప్పులు తీర్చలేక, అప్పులకు వడ్డీలు కట్టలేక పాకిస్థాన్ ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆర్థికంగా పాకిస్థాన్ పరిస్థితి ఇప్పటికే ఏమాత్రం బాగా లేదు. ‘బ్లాక్ లిస్టు’లో చేర్చడమంటూ జరిగితే కోలుకోలేని దెబ్బే అవుతుంది.

ఇప్పటికే ‘గ్రే’ జాబితాలో పాక్​

ఇప్పటికే పాకిస్థాన్​ను ‘గ్రే’ లిస్టులో పెట్టింది ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’. టెర్రరిస్టు సంస్థలకు నిధులు అందకుండా చూడటం, మనీ లాండరింగ్‌‌ని కట్టడి చేయడంలో ఫెయిలైన దేశాలను ‘గ్రే’ జాబితాలో చేర్చుతారు. ఈ జాబితాకెక్కితే ఆ దేశాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి మరే దేశమూ, ఫైనాన్షియల్‌‌సంస్థలు ముందుకు రావు. ‘గ్రే’ లిస్టులోని దేశాల కార్పొరేట్‌‌సంస్థలకు విదేశీ రుణాలు పుట్టవు. అభివృద్ధిలో ఎన్నో ఏళ్లు వెనక్కి పోవడం ఖాయం అంటున్నారు ఎనలిస్టులు.