చెన్నై: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. మీడియం పేసర్ ఆకాశ్ మద్వాల్ (3.3-–0-–5–5) అద్భుత బౌలింగ్‌తో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాకిచ్చాడు. ఫలితంగా బుధవారం జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ముంబై 81 రన్స్ భారీ తేడాతో లక్నోను చిత్తు చేసి క్వాలిఫయర్–2కు దూసుకెళ్లింది. టాస్ గెలిచిన ముంబై 20 ఓవర్లలో 182/8 స్కోరు చేసింది. కామెరూన్ గ్రీన్ (23 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 41), సూర్యకుమార్ (20 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) రాణించారు. తర్వాత లక్నో 16.3 ఓవర్లలోనే 101 రన్స్‌కు కుప్పకూలింది. మార్కస్ స్టోయినిస్ (27 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40) టాప్ స్కోరర్. ముంబై సూపర్ ఫీల్డింగ్‌కు ముగ్గురు రనౌటయ్యారు. ఆరుగురు సింగిల్ డిజిట్‌కు పరిమితం కాగా, ఇద్దరు డకౌటయ్యారు. మద్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో ముంబై.. గుజరాత్‌తో తలపడుతుంది.
బౌలింగ్ అదుర్స్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబైని కట్టడి చేయడంలో లక్నో బౌలర్లు నవీన్ ఉల్ హక్ (4/38), యష్ ఠాకూర్ (3/34) సూపర్ సక్సెస్ అయ్యారు. ఆరంభంలో స్లోగా బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ (11)ను నాలుగో ఓవర్‌లోనే నవీన్ పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి ఓవర్‌లో ఇషాన్ (15)ను యష్ ఠాకూర్ దెబ్బకొట్టాడు. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 62/2 స్కోరు చేసింది. ఈ దశలో గ్రీన్, సూర్య నిలకడగా ఆడారు. సింగిల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టడంతో థర్డ్ వికెట్‌కు 66 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నమోదైంది. ఇక ఫర్వాలేదనుకుంటున్న తరుణంలో 11వ ఓవర్‌లో నవీన్ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మూడు బాల్స్ తేడాలో ఈ ఇద్దర్ని ఔట్ చేసి షాకిచ్చాడు. దీంతో ముంబై స్కోరు 105/4గా మారింది. టిమ్ డేవిడ్ (13), తిలక్ వర్మ (26) భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేసినా లక్నో బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ ముందు ఇది సాధ్యం కాలేదు. ఐదో వికెట్‌కు 43 రన్స్ జత చేసి17వ ఓవర్‌లో డేవిడ్ ఔటయ్యాడు. తర్వాతి ఓవర్‌లో తిలక్‌ను నవీన్ పెవిలియన్‌కు పంపడంతో స్కోరు 159/6 అయ్యింది. ఈ దశలో జోర్డాన్ (4)తో కలిసి నెహాల్ వదేరా (23) బ్యాట్ ఝుళిపించడంతో ముంబై 180 రన్ మార్క్‌ను అందుకుంది.
మద్వాల్ స్ట్రోక్
ఛేజింగ్‌లో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. రెండో ఓవర్‌లో ప్రేరక్ మన్కడ్ (3) ఔట్‌తో మొదలైన పతనం వేగంగా సాగింది. ఓ ఎండ్‌లో స్టోయినిస్ ఒంటరి పోరాటం చేసినా.. రెండో ఎండ్‌లో ఆకాశ్ మద్వాల్ సూపర్ బౌలింగ్‌తో దెబ్బకొట్టాడు. దీంతో కైల్ మేయర్స్ (18), క్రునాల్ పాండ్యా (8), ఆయూష్ బదోని (1), నికోలస్ పూరన్ (0) వరుస విరామాల్లో ఔటయ్యారు. ఫలితంగా పవర్‌ప్లేలో 54/2తో ఉన్న స్కోరు ఫస్ట్ టెన్‌లో 74/5గా మారింది. 12వ ఓవర్‌లో స్టోయినిస్ రనౌట్‌తో మ్యాచ్ కీలక మలుపు తీసుకుంది. తర్వాతి ఓవర్‌లో కృష్ణప్ప గౌతమ్ (2) రనౌట్ కావడంతో 92/7తో ఎదురీత మొదలుపెట్టింది. 15వ ఓవర్‌లో మద్వాల్ దెబ్బకు రవి బిష్ణోయ్ (3)తో పాటు దీపక్ హుడా (15) రనౌటయ్యాడు. అప్పటికి స్కోరు 100/9. ఇక 30 బాల్స్‌లో 83 రన్స్ చేయాల్సిన దశలో తన లాస్ట్ ఓవర్‌లో మద్వాల్.. మోషిన్ ఖాన్ (0)ను ఔట్ చేసి ముంబైని గెలిపించాడు.