ముంబైకి మెట్రో వద్దట..!

ముంబై లోకల్​ ట్రైన్లలో రోజూ 75 లక్షల మందికి మించి జనాలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంత కిక్కిరిసి జర్నీ చేసే రైల్వే లైన్లు ప్రపంచంలో మరెక్కడా లేవు. కూర్చోవటానికి సీటు దొరకటం సంగతి దేవుడెరుగు. కాలు పెట్టి నిలబడటానికి చోటు దొరికినా చాలు అనేంత రేంజ్​లో ప్యాసింజర్లు ప్రయాణిస్తుంటారు. ఈ రద్దీని కొద్దిగైనా తగ్గించాలన్న లక్ష్యంతో కడుతున్న మెట్రోరైలు కారిడార్​ను సహజంగా ఎవరైనా స్వాగతిస్తారు. కానీ.. ఈ నగరవాసులు తమకు మెట్రో రైలు వద్దని, పచ్చదనమే ముద్దని అంటున్నారు.

బిజినెస్​ క్యాపిటల్​ సిటీ ముంబైలో నిత్యం లోకల్​​ రైళ్లు ఎక్కే, దిగే ప్రయాణికుల సంఖ్య 75 లక్షల పైమాటే. ఈ​ ట్రైన్లలో జనం పరిమితికి కొన్ని రెట్లు మించి వచ్చీపోతూ ఉంటారు. పొద్దుతో పనిలేకుండా ఎప్పుడు, ఎక్కడ చూసినా ‘ప్యాసింజర్లతో కుక్కేశారా?’ అని ముక్కున వేలేసుకునేలా రైళ్లు కనిపిస్తుంటాయి. ప్రపంచంలోని ఏ దేశంలోనూ, ఏ సిటీలోనూ రైల్వే లైన్లు ఇంత ఇరుకు​గా అనిపించవు. ఈ లోడ్​ని కాస్త తగ్గించటానికి ముంబైలో వరల్డ్​ క్లాస్​ మెట్రో రైల్​ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ సిటీలో ఇప్పుడు ఒక్క కారిడారే ప్రయాణానికి అందుబాటులో ఉంది. కారిడార్​​–1ని​ ఐదేళ్ల క్రితం ఓపెన్​ చేశారు. భవిష్యత్​లో మరో 15 కారిడార్లు రానున్నాయి. వీటిలో కొన్నింటి నిర్మాణం కొనసాగుతోంది.

మూడో కారిడార్​పై పీటముడి

మూడో కారిడార్​ నిర్మాణం మరో రెండున్నరేళ్లలో (2021 చివరికి) పూర్తవుతుంది. ఇది ప్రారంభమైతే 13.9 లక్షల మంది ప్రయాణికులకు రిలీఫ్​ దొరుకుతుంది. వాళ్లు ఏసీ బోగీల్లో హాయిగా వెళ్లిరావచ్చు. సిటీలోని సౌత్​, వెస్ట్​ ఏరియాలను(కొలాబా–బాంద్రా–శాంతాక్రజ్​ ప్రాంతాలను) కలిపే ఈ మెట్రో లైన్​ నంబర్​–3పై ఇప్పుడు పీటముడి పడింది. ఈ కారిడార్​లో భాగంగా ఆరే మిల్క్​ కాలనీలో నిర్మించే మెట్రో డిపోని ముంబైలోని సోషల్​ యాక్టివిస్టులు, యాక్టర్లు, పొలిటీషియన్లు సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. డిపో నిర్మాణం కోసం కాలనీలోని సుమారు 2,700 చెట్లను తల్లీ, పిల్ల వేర్లతో సహా పీకేసి మరో ప్రాంతంలో నాటడానికి బృహన్​ ముంబై మునిసిపల్​ కార్పొరేషన్​(బీఎంసీ) పర్మిషన్ ఇవ్వటమే ఈ ఆందోళనకు ముఖ్య కారణం.

మెట్రో రైల్​ ప్రాజెక్టు నిర్మాణం వల్ల వేల సంఖ్యలో సిటిజన్లు రోజూ ఇబ్బందులు పడుతున్నా సహకరిస్తున్నందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్​ ఇటీవల థ్యాంక్స్​ చెప్పారు. ఇది జరిగిన కొద్ది రోజులకే డిపోకి వ్యతిరేకంగా నిరసనలు జరగటం చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్​ యాక్టర్ల ఆందోళన​

సిటీ సబర్బ్​లోని గోరెగావ్​ ఈస్ట్​ ప్రాంత పరిధిలోకి వచ్చే ఆరే మిల్క్ కాలనీలో ప్రభుత్వ డైరీ ఫామ్​ ఉంది. దీన్ని 1,278 హెక్టార్లకుపైగా దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పాటుచేశారు. కారిడార్​–3 నిర్మాణ బాధ్యతలను ముంబై మెట్రో రైల్​ కార్పొరేషన్​ లిమిటెడ్(ఎఎంఆర్​సీఎల్​)కి ఇచ్చారు. మెట్రో డిపో నిర్మాణం వల్ల మిల్క్​ కాలనీ మొత్తం కమర్షియల్​ హబ్​గా మారుతుందనేది స్థానికుల ప్రధాన అభ్యంతరం. ఫారెస్ట్​ కాస్తా కమర్షియల్​ ప్రాంతమైతే దగ్గరలోని మిథీ రివర్​ క్యాచ్​మెంట్ ఏరియాపై ఎఫెక్ట్​ పడుతుందని నిరసనకారులు అంటున్నారు. నది పొంగి పొర్లితే ముంబై ఎయిర్​పోర్ట్​ మునిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.​ యాక్టర్లు శ్రద్ధా కపూర్​, రవీనా టాండన్​, సింగర్​ లతా మంగేష్కర్​ తదితరులు రోడ్డెక్కి ప్రభుత్వ చర్యను ఖండించారు.

వేరే ప్రాంతానికి మార్చాలి

మెట్రో డిపోని మిల్క్​ కాలనీకి బదులు కంజుర్​ మార్గ్​లో కట్టాలని యాక్టివిస్టులు సూచిస్తున్నారు. ఈ ప్రాంతం మిల్క్​ కాలనీకి తూర్పున 7.5 కిలోమీటర్ల దూరంలోనే ఉందని చెబుతున్నారు. మెట్రో డిపోని జోగేశ్వరి–విఖ్రోలి లింక్​ రోడ్డుకి దగ్గరలో ఉన్న కంజుర్​ మార్గ్​కి తరలించటం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని చాలా వరకు తగ్గించొచ్చని అంటున్నారు.

పొల్యూషన్​కి సొల్యూషన్​

మిల్క్​ కాలనీలోని 2,700 చెట్ల తొలగింపునకు బీఎంసీ సరే అనటం పట్ల వస్తున్న విమర్శలపై ఎంఎంఆర్​సీఎల్ ఎండీ​ అశ్విని భిడే స్పందించారు. కాలనీలో మొత్తం 4.8 లక్షల చెట్లు ఉన్నాయని, వాటితో పోల్చితే తాము నరికే చెట్ల సంఖ్య చాలా తక్కువని చెప్పారు. చెట్లు కొట్టేయటం వల్ల పెరిగే కాలుష్యం కన్నా మెట్రో రైల్​ రాకతో తగ్గే పొల్యూషన్​ ఎంతో ఎక్కువని అన్నారు. 2,700 చెట్లు ఏడాదిపాటు పీల్చుకునే కార్బన్​డైఆక్సైడ్​ క్వాంటిటీ.. మెట్రో రైలు కేవలం ఏడు రోజులు తిరగటం వల్ల వాతావరణంలో తగ్గిపోతుందని ఆమె వివరించారు.

ఒక్క చెట్టుకి బదులు ఆరు మొక్కలు

మిల్క్​ కాలనీలో తాము నేలమట్టం చెట్లకు బదులు ఆరు రెట్ల ఎక్కువ మొక్కలు నాటతామని ఎంఎంఆర్​సీఎల్​ ప్రతిపాదించింది. 23,846 మొక్కలు నాటడం కోసం సంజయ్​గాంధీ నేషనల్​ పార్క్​తో ఒప్పందం కుదుర్చుకుంది. మెట్రో–3 వాడకంలోకి వస్తే వాతావరణం​లోకి 2.61 మెట్రిక్​ టన్నుల కార్బన్​ డై ఆక్సైడ్​ ఎమిషన్లు తగ్గుతాయని ‘యునైటెడ్​ నేషన్స్​ ఫ్రేమ్​వర్క్​ ఫర్​ క్లైమేట్​ ఛేంజ్’(యూఎన్​ఎఫ్​సీసీ) రిపోర్ట్​ అభిప్రాయపడినట్లు బీఎంసీ కమిషనర్​, ఎంఎంఆర్​సీఎల్​ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్​ పర్దేశి గుర్తుచేశారు.

‘బిగ్​ బీ’ సపోర్ట్​పై నిరసన

గ్రీనరీకి నష్టం కలిగించేలా మెట్రో డిపో కట్టనుండటంపై బాలీవుడ్​ నుంచి వ్యతిరేకత వస్తుండగా  అమితాబ్​ బచ్చన్ భిన్నంగా స్పందించారు. మెట్రో రైల్ నిర్మాణాన్ని సపోర్ట్​ చేస్తూ ఆయన ట్వీట్​ చేయటం నిరసనకు దారితీసింది. ‘మెట్రో రైల్..​ వేగంగా, సౌకర్యవంతంగా, సమర్థవంతంగా పనిచేసే రవాణా వ్యవస్థ. నా ఫ్రెండ్​ ఓ రోజు అర్జెంట్​గా హాస్పిటల్​కు వెళ్లాల్సి వచ్చింది. కారుకు బదులు మెట్రో​లో అనుకున్న సమయానికి చేరుకున్నారు. ఆ సర్వీస్​కి ఇంప్రెస్​ అయ్యారు. పొల్యూషన్​కి కరెక్ట్​ సొల్యూషన్​ ఇదే. గ్రీనరీ ముఖ్యమే. దానికోసం గార్డెన్​లో చెట్లు నాటాలి. నేనూ అదే చేశా. మరి మీరు?’ అని అమితాబ్​ ​ రీసెంట్​గా మెట్రోని మెచ్చుకుంటూ ట్విట్టర్​లో పోస్టింగ్​ పెట్టారు. తెల్లారే కొంత మంది యాక్టివిస్టులు ముంబైలోని జల్సా ప్రాంతంలో ఆయన ఇంటి ఎదుట రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

Mumbai citizens says that they don't want metro train